పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం కాల్వచర్లలో వామన్ రావు దంపతుల హత్య కేసులో ముగ్గురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వామన్ రావు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్, వసంతరావు, కుమార్ పై వామన్ రావు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.  కుట్ర, మర్డర్లకు సంబంధించి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కుమార్, చిరంజీవి, దాస్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వామన్ రావు దంపతుల హత్యను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు కోర్టులను బహిష్కరించి న్యాయవాదులు ఆందోళనలు నిర్వహించారు. ఈ హత్యలపై తెలంగాణ హైకోర్టు కూడ స్పందించింది. సుమోటోగా ఈ కేసును తీసుకొంది. నిర్ధిష్ట కాలపరిమితితో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కుంట శ్రీనివాస్ కు వామన్ రావుకు మధ్య కొంతకాలంగా గొడవలున్నాయి. ఈ కారణంగానే హత్య జరిగిందా ఇతరత్రా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.