Asianet News TeluguAsianet News Telugu

వైశాలి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు..

హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడలో వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని శనివారం ఆదిభట్ల పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. 

Vaishali Kidnap Case Police reconstruct the crime scene with Naveen Reddy
Author
First Published Dec 25, 2022, 11:54 AM IST

హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడలో వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని శనివారం ఆదిభట్ల పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం ఆదిభట్ల పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి ఈ కేసుకు సంబంధించిన సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ను పోలీసులు పూర్తి చేశారు. గత రాత్రి 9 గంటల సమయంలో హస్తినపురంలోని మిస్టర్ టీ పాయింట్ నుంచి మన్నెగూడలోని వైశాలి ఇంటి వరకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. 

అదే విధంగా వైశాలి కిడ్నాప్‌కు సంబంధించి పలు విషయాలనై పోలీసులు నవీన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైశాలిపై విచక్షణ రహితంగా దాడి చేసినట్టుగా నవీన్ రెడ్డి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు మిస్టర్ టీకి చెందిన పలువురు ఉద్యోగులతో సహా మొత్తం 41 మందిని అరెస్టు చేశారు. నవీన్ రెడ్డిపై ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు ఉన్నాయి.

ఇక, వైశాలి కిడ్నాప్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి  తెలిసిందే. వైశాలి నిశ్చితార్థం రోజే.. దాదాపు 40 మందితో ఆమె ఇంటికి వచ్చిన నవీన్ రెడ్డి విధ్వంసం సృష్టించాడు. నవీన్ రెడ్డితో వచ్చినవారు వైశాలి కుటుంబ సభ్యులపై దాడి చేయగా.. నవీన్ రెడ్డి ఆమెను తీసుకుని కారులో వెళ్లిపోయాడు. అయితే కొన్ని గంటల్లోనే పోలీసులు వైశాలిని క్షేమంగా రక్షించారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నవీన్ రెడ్డిని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు.. తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. నవీన్ రెడ్డికి ఇబ్రహీంపట్నం కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. 

ఈ కేసులో నవీన్ రెడ్డిని ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇబ్రహీం పట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇబ్రహీంపట్నం కోర్టు ఒక్క రోజు మాత్రమే కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే జిల్లా కోర్టు శుక్రవారం.. నవీన్ రెడ్డిని మూడు రోజల పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు శనివారం ఉదయం నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios