హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు తలపెట్టిన దీక్షను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాగూరు గురువారం నాడు విరమింపజేశారు.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో హనుమంతరావు తన ఇంట్లోనే దీక్షకు దిగిన విషయం తెలిసిందే.  ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీక్షను విరమించాలని వీహెచ్ కు ఠాగూర్ సూచించారు. ఠాగూర్ సూచన మేరకు హనుమంతరావు దీక్షను విరమించేందుకు ఒప్పుకొన్నారు.  వీహెచ్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేవరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమం కొనసాగిస్తామని వీహెచ్ ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్ తీరును ఆయన  తప్పుబట్టారు. రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ కు అవమానం జరుగుతోందన్నారు. రాజ్యాంగం ప్రకారంగానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని ఆయన హితవు పలికారు.

గతంలో కూడ ఇదే అంశంపై హనుమంతరావు ఢిల్లీలో కూడ దీక్షకు దిగారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహన్ని తొలగించడాన్ని తప్పుబడుతూ ఆయన పలు మార్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. .