Asianet News TeluguAsianet News Telugu

మహిళల దెబ్బకు సర్కారు మందు : సంచార వైన్స్ షాప్

అక్కడి మహిలు కాలికామాత అవతారమెత్తారు. తమ పవరేంటో సర్కారుకు చూపించారు. మహిళా లోకమంతా ఏకమై సర్కారు మెడలు వంచారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా సర్కారు అడుగులు వేయకుండా అడ్డుకున్నారు. మహిళల దెబ్బకు దిగొచ్చిన అక్కడి ప్రభుత్వం ఆదాయ ఆర్జనకు కొత్త మార్గం ఎంచుకుంది. 

Uttarakhand opens mobile wine shops to counter womens oppositoin to fixed shops

ఉత్తరాఖండ్ లో మహిళల ఉద్యమం విజయవంతమైంది. నివాస ప్రాంతాల్లో వైన్ షాపులు ఏర్పాటు చేయరాదన్నది వారి డిమాండ్. ఆ డిమాండ్ సాధన కోసం వారు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. వారి ఆందోళనకు ప్రతిపక్షాలు జత కావడంతో ఉద్యమం ఉధృతమైంది. ఆ ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరైన సర్కారు దిగొచ్చింది.

 

జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరం లోపల ఉన్న మద్యం దుకాణాలు షిఫ్ట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 402 వైన్ షాపులను తరలించాల్సిన పరిస్థితి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొంది. దీంతో ఆ తరలించాల్సిన మద్యం దుకాణాలను జనావాసాల్లో ఏర్పాటు చేయాలనుకుంది ప్రభుత్వం. కానీ స్థానిక మహిళల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. వైన్స్ షాపులను జనావాసాలకు తరలించకుండా మూసేస్తే ఆదాయం కోల్పోతామన్న ఆందోళన సర్కారులో నెలకొంది. దీంతో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సంచార వైన్స్ ను ప్రారంభించింది.

 

ట్రక్కులు లేదా వ్యాన్లలో సంచార మందు దుకాణాలు నడుపుకోవచ్చని సర్కారు లైసెన్సులు జారీ చేసింది. అలా తొలుతు రాణిబాగ్ అనే ప్రాంతంలో మొదటి సంచార మందు దుకాణం షురూ అయింది. ఈ సంచార మద్యం దుకాణం దేశం మొత్తంలో చర్చనీయాంశమైంది. సదరు మొదటి సంచార మందు షాపులో ఇండియాలో తయారైన మందు బ్రాండ్స్ తోపాటు విదేశీ బ్రాండ్స్ మద్యం కూడా అందుబాటులో ఉంచారు.

 

సర్కారు అనుమతించిన స్థలంలో వ్యాన్ లో ఈ సరుకు జనాలకు అందుబాటులో ఉంటుంది. ఈ అనుమతి పొందిన స్థలం జనారణ్యంలో కాకుండా ఊరి బయట ఉంటుంది. దీంతో మహిళకు అవస్తలు తీరిపోగా, సర్కారు ఆదాయార్జనలో తేడా పెద్దగా లేదని అధికార వర్గాలు అంటున్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళల పోరాటం నేడు అందరికీ స్పూర్దిదాయకం గా నిలుస్తోంది. తెలుగు నేల మీద కూడా గతంలో మద్య నిషేధ ఉద్యమం జరిగి విజయవంతమైంది. తర్వాత ప్రభుత్వాలు మద్య నిషేధాన్ని ఎత్తివేశాయి. తీరా ఇప్పుడు కొత్త పద్ధతిలో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 మందికి ఒకటి చొప్పున బెల్ట్ షాపులు నెలకొని ఉన్నాయి. గ్రామ గ్రామాన మంచినీరు దొరకకపోయినా బెల్టు షాపుల్లో మందు పుష్కలంగా దొరుకుతున్నది. దీంతో తెలుగు మహిళా లోకం ఇప్పటికే బెల్డు షాపులకు వ్యతిరేకంగా అక్కడో ఇక్కడో ఆందోళనలు చేపడుతున్నది.

 

ఎపిలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులన్నీ ఎత్తేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తెలంగాణలోనూ గుడుంబాపైన పంజా విసిరిన సర్కారు బెల్టు షాపులు మాత్రం తీపించలేకపోయింది. మరి తెలుగు మహిళా లోకం ఉత్తరాఖండ్ మహిళా స్పూర్తితో పోరాటం చేస్తే బెల్టు షాపులు మాయమవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు జనాలు. కానీ సర్కారు రూటు మారుస్తుందేమో మరి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios