అబ్బా.. కేసిఆర్ ను ఉత్తమ్ బానే ఉతికిండుగా (వీడియో)

Uttam tears into KCR  says  kcr is a hypocrite
Highlights

కేసిఆర్ భాషలోనే ఉత్తమ్ రిప్లై...

తెలంగాణ సిఎం కేసిఆర్ ను పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉతికి పారేసిండు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కేసిఆర్ పై తీవ్రమైన పదజాలంతో విమర్శలకు దిగారు ఉత్తమ్. తెలంగాణ నిరుపేదల డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని కేసిఆర్ కుటుంబం అనుభవిస్తోందని మండిపడ్డారు. అమరవీరులకు పైసలు ఉండవు, దళిత, గిరిజన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ చెల్లించేందుకు పైసలుండవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పైసలు ఉండవు, ఎస్సీ, ఎస్టీ లోన్లకు పైసలు ఉండవు, దళిత, గిరిజనులకు మూడెకరాలు కొనిచ్చేందుకు పైసలుండవు, కానీ మీరు మాత్రం వందల కోట్లతో ఇండ్లు కట్టుకుంటున్నారు అని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లలో, ప్రయివేటు జెట్లలో కేసిఆర్ ఫ్యామిలీ ప్రయాణాలు చేస్తోందని ఆరోపించారు.

                     

ప్రజా ధనం సరిగ్గా ఖర్చు పెడుతున్నరా లేదా అని చూసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాకుంటదని హెచ్చరించారు. నాకు తెలివిలేదు అంటవా? నీకే తెలివి ఉందా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. కేసిఆర్ కుటుంబం తెలంగాణ ముసుగు వేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రగతిభవన్ లో ఆంధ్రా కాంట్రాక్టర్లు, సినిమావాళ్లు, నీ దోస్తులకు తప్ప సామాన్య రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ప్రవేశం ఉందా అని ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో అందరు ముఖ్యమంత్రులు అధికారిక నివాసంలో సామాన్యులు ఎంత మంది వస్తే అంతమందిని కలిసి వారినుంచి పిటిషన్లు తీసుకుని వీలైనంత సహాయం చేసేవారు. కానీ కేసిఆర్ నివసించే ప్రగతిభవన్ లోకి సామాన్య ప్రజలకు ఎంట్రీ లేదకదా అన్నారు. సామాన్య ప్రజలెందుకు కనీసం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకే ఎంట్రీ లేదని ఎద్దేవా చేశారు. మేము ఎవరి సంచులూ మోయలేదు. మీరే సంచులు తీసుకుంటున్నారు. కేసిఆర్ గత చరిత్ర ఏందో. కుటంబసభ్యులు అమెరికాలో ఏం చేసేవారో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. అమెరికాలోనే నా పిల్లలు ఉంటారని కేసిఆర్ ఆనాడు చెప్పినా.. కానీ కొడుకో దిక్కు, బిడ్డో దిక్కు తెలంగాణ మీద పడి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇది చాలదన్నట్లు మళ్లీ మా మీద ఏడుస్తున్నారా అని ఎద్దేవా చేశారు.

ప్రగతిభవన్ 150 గదుల్లో ఉందని తాను అనలేదన్నారు. కానీ లక్ష ఎస్ఎఫ్టీ తో ఉందా లేదా చెప్పాలన్నారు. దేశంలో ఎన్నికైన ప్రధాని మొదలు సిఎంలెవరూ ఇంత విలాసవంతమైన భవనాల్లో నివాసం ఉండడంలేదన్నారు. నీ బెడ్రూమ్, బాత్రూమ్ లు బుల్లెట్ ఫ్రూఫ్ కాదా? చెప్పాలన్నారు. నిరుపేదల డబ్బుతో నువ్వు ఇల్లు కట్టుకున్నవా? లేదా? వెల్లడించాలన్నారు. మాట్లాడేందుకు కేసిఆర్ కు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి అని ఘాటుగా విమర్శించారు.

కేసిఆర్ ఒల్లు బలిషి, అహంకారం పెరిగి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్ము తిని తిని కేసిఆర్ ఫ్యామిలీ బలిసిపోయిందన్నారు.  కేసిఆర్ ఏదో తీస్ మార్ ఖాన్ అన్నట్లు ఫెడరల్ ఫ్రంట్ పెడతాడట. ఇక్కడ తెలంగాణలోనే దిక్కులేదు. కానీ దేశాన్ని ఉద్ధరిస్తడట అని విమర్శించారు.

భారతదేశాన్ని చైనాతో పోలుస్తుండు.. కనీస అవగాహన లేదు కేసిఆర్ కు అని విమర్శించారు. చైనాను, భారత్ తో పోల్చవచ్చా? అసలు చైనాలో డెమోక్రసీ ఉందా? హ్యూమన్ రైట్స్ ఉన్నాయా?ఇవేవీ తెలియకుండా చైనాతో పోల్చడం సమంసమా అని నిలదీశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. టిఆర్ఎస్ పోరాటంతో టి పిసిసి రాలేదు. సోనియాగాంధీ దయతో నీకు సిఎం కుర్చీ వచ్చింది ఆ ముచ్చట గుర్తు పెట్టుకో అని పేర్కొన్నారు. ఎంతసేపు కేసిఆర్ పని చిల్లర రాజకీయాలు చేయడం తప్ప ఇంకోటి లేదన్నారు. కేసిఆర్ లాగా తాను క్యారెక్టర్ లేని వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. 16 ఏళ్ల వయసులోనే ఆర్మీలో పనిచేసేందుకు వెళ్లానని, నిస్వార్థ ప్రజా సేవ కోసం రాజకీయాలకు వచ్చానని అన్నారు.

తెలంగాణ ప్రజలను మరోమారు మోసం చేయడానికి, ఇచ్చిన మాటమీద జనాలు నిలదీస్తారని భయంతోనే దేశమంతా తిరుగుతూ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ లేదు మన్ను, మషానం లేదు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎంపి సీట్లే రావు. అలాంటప్పుడు ఫ్రంట్ ఏంది? అని ప్రశ్నించారు. దేశానికే ఆదర్శం తెలంగాణ వ్యవసాయం అంటున్నాడు... భారతదేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నది మీ పరిపాలనలోనే కదా అని ప్రశ్నించారు. చనిపోయిన రైతులకు కనీసం పరామర్శ కూడా లేదు తెలంగాణలో అని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు సరైన రేటు పెట్టి కొనుగోలు చేయలేదు కాబట్టే రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.  

 

loader