హుజూర్ నగర్ : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పై టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోనే రాజకీయ వాతావరణం బాగా వేడెక్కి ఉన్నది. పోరు జరుగుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వేడి తారా స్థాయిలో ఉంది. 

ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీ నేతలపై మరొకపార్టీ నేతలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని అన్నాడు. గుత్తా కొడుకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అక్రమంగా దక్కించుకొని నిర్వహిస్తున్నాడు. అది తప్పు కాదా అని ప్రశ్నించాడు. కేంద్ర విజిలెన్సు సంస్థతో గుత్తా సుఖేందర్ రెడ్డి పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. అప్పుడు తండ్రీ కొడుకుల అక్రమాలు బయటకొస్తాయని అన్నాడు. 

పార్టీ ఫిరాయింపులను తెరాస పార్టీనేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు హుజూర్ నగర్ ఉప ఎన్నిక కూడా 21 అక్టోబర్ నాడు నిర్వహించనున్నారు. అక్టోబర్ 24న కౌంటింగ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.