టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడానికి ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఇక తాను ఈ పదవిలో కొనసాగలేనని పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయననే టీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరినట్టు సమాచారం.

నిజానికి 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని భావించారు. చిరకాల ప్రత్యర్ధిగా రాష్ట్రంలో హోరాహోరీ తలపడిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది.

ఆ తర్వాత ఎలాగో నెట్టుకొచ్చిన ఉత్తమ్‌కు దుబ్బాక ఉప ఎన్నికలు సవాల్‌గా నిలిచాయి. కనీసం రెండో స్థానంలో అయినా కాంగ్రెస్ పార్టీ నిలవకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వచ్చాయి.

అభ్యర్ధి ఎంపికలో తేల్చకపోవడం, ప్రత్యర్ధి పార్టీల్లో ఉన్నట్లు దూకుడైన నేతల్ని ప్రచార బరిలో దించకపోవడం గట్టి ప్రభావం చూపింది. ఈ వరుస పరాజయాలు అంతిమంగా ఉత్తమ్‌ కుర్చీకి ఎసరు తెచ్చాయి.