ఆఘమేఘాల మీద ఢిల్లీకి ఉత్తమ్: రాహుల్ తో రేవంత్ రెడ్డి ఇష్యూ సైతం

Uttam kumar Reddy to meet Rahul Gandhi
Highlights

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది.

హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చింది. అత్యవసరంగా ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ ఆయనకు కబురు పెట్టారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు శనివారం ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. 

ప్రధానంగా పదవుల విషయంలోనే రాహుల్ గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చిస్తారని అంటున్నారు. ఎవరికి వారు తానంటే తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అర్హుడిని అని ప్రకటించుకోవడాని అధిష్టానం సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత తనకు ఏ బాధ్యతలూ అప్పగించడం లేదని రేవంత్ రెడ్డి కాస్తా అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో కాంగ్రెసులో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి విషయంపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని, అధిష్టానం తనను సక్రమంగా వాడుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ విషయం చర్చకు వస్తే ఇతర పార్టీల నుంచి ఏయే నాయకుడిని ఎలా వాడుకోవాలనే విషయంపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. 

రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని కొంత మంది కాంగ్రెసు నేతలు ఇప్పటికే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ విషయంపై సిఎల్పీ నేత జానా రెడ్డి కూడా కుంతియాతో మాట్లాడారు. 

ప్రధానమైన పదవులన్నీ ఒకే సామాజికవర్గం చేతిలో ఉండడంతో మార్పులు చేర్పులు చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమతూకాన్ని పాటిస్తూ పదవుల పంపకం చేస్తారని అంటున్నారు. 

loader