UPSC తరహాలో TSPSC.. ఉద్యోగాల భర్తీపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Uttam Kumar Reddy: ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలం అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. భవిషత్యులో అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Uttam Kumar Reddy: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, టీఎస్‌పీఎస్‌సీలో అక్రమాలు జరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్‌ను కలవబోతున్నట్లు తెలిపారు. గతంలో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పలు ఉద్యోగాల భర్తీలో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడతామన్నారు. యూపీఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్‌సీని రూపొందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టుతో నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో గల 10 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగు నీరు, అలాగే తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామని, ఈ ప్రాజెక్టు ద్వారా 1200 గ్రామాలకు మంచినీరు, 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చునని వెల్లడించారు. జాతీయ హోదా ఇస్తూ 60 శాతం వ్యయం కేంద్రం భరించాలని కోరినట్లు తెలిపారు. మొదటి దశలో తాగునీటి పనులు, రెండో దశలో సానునీటి పనులు జరుగుతున్నాయన్నారు.