పంచాయతీ ఎన్నికలకు సంసిద్దంగా ఉన్నామన్న ఉత్తమ్

టీ కాంగ్రెస్ నేతలు తనపై ఫిర్యాదు చేయడానికే వెళ్లారని జరుగుతున్న ప్రచారం గురించి టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నేతలు తనపై ఫిర్యాదు చేయడానికి డిల్లీకి వెళ్లారని అనుకోవడం లేదని తెలిపారు. ఇటీవలే రాహుల్ గాంధీ పుట్టిన రోజు జరిగినందున ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లారని అన్నారు. దీంతో టీ కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందని ఇతర పార్టీల నాయకులు దష్ప్రచారం చేశారని ఉత్తమ్ తెలిపారు. 

ఇక కాంగ్రెస్ నుండి మరిన్న వలసలు ఉంటాయని అధికార పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నుండి కాదు ఇకనుంచి టీఆర్ఎస్, టిడిపి,బిజెపి ల నుండి కాంగ్రెస్ లోకి వలసలుంటాయని స్పష్టం చేశారు. స్థానిక నేతలు,కార్యకర్తలతో మాట్లాడి వారందరిని త్వరలోనే పార్టీలోకి చేర్చుకుంటామని అన్నారు.

ఇక పంచాయితీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సంసిద్దంగా ఉన్నట్లు ఉత్తమ్ దీమా వ్యక్తం చేశారు. కానీ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల లో కూడా అధికార పార్టీ అస్థవ్యస్థంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కాకుండా విరుద్దంగా ఉన్న రిజర్వేషన్లపై త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నేతలతో సమావేశమవనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కు అడ్రసే లేదని, రానున్న ఎన్నికల్లో ఉన్న కాస్త అడ్రస్ గల్లంతవడం ఖాయమని వ్యాఖ్యానించారు.