కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికే కౌశిక్.. రేవంత్‌పై ఆరోపణలు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2018లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం వల్లే కౌశిక్ లీడర్ అయ్యారని ఆయన అన్నారు. కౌశిక్ రెడ్డి తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికే కౌశిక్ ఆరోపణలు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు . ఆయన పీసీసీ అధ్యక్షుడిలాగా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఈటలకు రేవంత్ రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పీసీసీ పదవిని ఎందుకు ఇవ్వలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ జెండా మోసినోళ్లమంతా పిచ్చోళ్లమా అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పొన్నం, రేవంత్ రెడ్డిలకు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. పొన్నంకి డిపాజిట్ వస్తుందేమో చూస్తానంటూ వ్యాఖ్యానించారు.
Also Read:మేం లుచ్చాలమా, రూ.50 కోట్లిచ్చి పదవి తెచ్చుకున్నారు: రేవంత్ రెడ్డిపై కౌశిక్
రేవంత్ రెడ్డి వల్ల ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు. పొన్నం, రేవంత్ రెడ్డిలు ఈటలకు కోవర్ట్‌లని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎలా అయ్యారో అందరికీ తెలుసునన్నారు. లుంగి కట్టుకుని ఢిల్లీ నుంచి వచ్చే మాణిక్ ఠాగూర్‌కి కొంచెం కూడా కామన్ సెన్స్ వుండదని, పెద్ద లీడర్‌ని అని చెప్పుకుంటారంటూ కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాణిక్ ఠాగూర్ పెద్ద యూజ్ లెస్ ఫాలో అని ధ్వజమెత్తారు. మాణిక్ ఠాగూర్‌కి రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
