హైదరాబాద్: గవర్నర్ తమిళిసై మీద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమకు తమిళిసై అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. కోవిడ్ పేరు చెప్పి తమకు అపాయింట్ మెంట్ నిరాకరిస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీకి కోవిడ్ అడ్డం రావడం లేదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తమిళిసైని ప్రశ్నించారు. ప్రధాని మోడీ కేసీఆర్ మిలాఖత్ అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. 

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా కాంగ్రెసు నాయకులు రాజ్ భావన్ కు బయలుదేరారు. దిల్ కుషా అతిథి గృహం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎఐసిసి ఇంచార్జీ మానిక్కం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు నేతలు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతు సమస్యలను చెప్పడానికి గవర్నర్ వద్దకు వెళ్దామంటే ఆటంకం కలిగిస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బిజెపి భాగస్వామ్య పార్టీలైన అకాలీదళ్, బిజెడిలతో పాటు 18 పార్టీలు వ్యతిరేకించినా బిల్లులను ఆమోదించారని ఆయన అన్నారు. 

రాజ్యసభలో బిజెపికి బలం లేకపోయినా అక్రమంగా బిల్లులను ఆమోదించుకున్నారని ఆయన విమర్శించారు. అంబానీ, ఆదానీ, అమెజాన్ లకు ప్రయోజనం చేకూర్చడానికే ఆ బిల్లులు తెచ్చారని ఆయన అన్నారు. బిల్లుల్లో రైతులకు రక్షణ, ధరల హామీ లేదని, కంపెనీలకు మాత్రమే స్వేచ్ఛ ఇస్తున్నారని ఆయన అన్నారు.

బిల్లుల వెనక ఉన్న కుట్రను ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. వ్యాపారులు నిత్యవసర సరుకులను నిలువ చేసి ధరలు పెంచి అమ్ముకునే స్వేచ్ఛ కల్పించారని ఆయన అన్నారు. మార్కెట్ యార్డుల వెలుపల అమ్ముకునే ధాన్యం విషయంలో రైతులకు రక్షణ కల్పించలేదని ఆయన అన్నారు. 

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించడంలో కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు బిజెపి ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు. మోడీతో కేసీఆర్ మిలాఖత్ అయ్యారని ఆయన అన్నారు. రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ ది అని ఆయన అన్నారు.