హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, హరీశ్ రావులపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.  అక్రమ పాస్ పోర్టు కేసులో అసలైన నిందితులు వారిద్దరేనని ఆయన అన్నారు. 

2007లో రషీద్ అనే వ్యక్తి సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆ విషయం చెప్పాడని ఆయన ఆరోపించారు. ఆకుల రాజేందర్, అనిరుధ్ రెడ్డి తదితరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్, హరీష్ రావుల పేర్లు చేర్చినప్పుడు ఆ కేసులో జగ్గా రెడ్డి పేరు లేదని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై 2005లో కేసు నమోదైతే 13 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. కమిషన్లు తీసుకొని గుజరాతీ వాళ్లను హరీశ్ రావు అమెరికాకు పంపించారని ఆయన ఆరోపించారు. గుజరాతీ మహిళను తన భార్యగా చూపించి అమెరికాకు పంపించారని ఆయన అన్నారు.

టీఆర్ఎస్ నేతలు, అధికారులు ఎక్సాట్రాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అందరి జాబితా రాసుకుంటున్నామని ఆయన అన్నారు. పౌరహక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పోలీసులు కేసిఆర్ తొత్తులుగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. మూడు నెలల్లో తమ ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం నేర్పాలని అన్నారు. 

కేసీఆర్ మాట్లాడితే బంగారు తెలంగాణ అంటారని, కానీ ఆయన బంగారు కుటుంబాన్నితయారు చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

2019లో గెలవలేమనే భయంతోనే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్తోందని కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు. ముందస్తు ఎన్నికలు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన జోగిపేటలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. నాలుగేళ్లలో 2 లక్షల కోట్ల అప్పుచేసిన ఘనత టీఆర్ఎస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రతి ప్రాజెక్టులోనూ పర్సంటేజీలు తీసుకున్నారని ఆరోపించారు.