హైదరాబాద్ వాసులకి హైదరాబాద్ మెట్రో రైల్ కార్పోరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెట్రో స్మార్ట్ రీఛార్జ్‌పై 50 శాతం వరకు (రూ.600 వరకు) క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ అమల్లోకి తీసుకురానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మెట్రో స్టేషన్లు, ఆన్‌లైన్‌లో రీఛార్జ్‌ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించనుందని స్పష్టం చేశారు. ప్రయాణికులకు వచ్చే క్యాష్ బ్యాక్ కూడా స్మార్ట్ కార్డులోనే జమ కానుందని వివరించారు.

అయితే రీఛార్జ్‌ చేసుకున్న మొత్తాన్ని 90 రోజుల్లోగా వినియోగించుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.

నగరంలోని మూడు కారిడార్లలో కలిపి నిత్యం 1.30 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఇటీవల సువర్ణ ప్యాకేజీలో భాగంగా 40 శాతం రాయితీ ప్రకటించిన అనంతరం ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగిందని వివరించారు. రేపటి నుంచి హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది.