నిరుద్యోగుల అభ్యర్ధన మేరకు పోలీస్ ఉద్యోగాలకోసం వెలువరించిన నోటిఫికేషన్ లో వయోపరిమితి అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఇటీవల ప్రకటించిన పోలీస్ శాఖ లోని అన్ని ఉద్యోగాలకు మూడేళ్లు వయోపరిమితిని సడలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఇవాళ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఓ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది.  .  

ఇటీవల రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 18,428 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా చేపట్టనున్నారు. అయితే ఆ నోటిఫికేషన్లో వయోపరిమితిపై సడలింపు ఇవ్వకపోవడంతో అర్హత కోల్పోతున్న చాలా మంది రోడ్డెక్కారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం వారు కోరినట్లు ఆరేళ్లు కాకుండా మూడేళ్లు సడలింపునిచ్చింది. 

ఈ నోటిఫికేషన్  లో ప్రకటించిన పోలీస్ డిపార్ట్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ అండ్ ఎస్‌పీఎఫ్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) పోస్టులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బోర్డు వెబ్‌సైట్‌ (www.tslprb.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.