రెండు కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసిన ఓ కిలాడీ లేడీ గ్యాంగ్ ను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారసురాలినంటూ ఏకంగా జనావాసాల మధ్యనున్న స్థలాన్ని ఎంచక్కా అమ్మేసుకుంది. చివరికి అసలు వారసులు రావడంతో...
ఉప్పల్ : Uppalలో ముగ్గురు మహిళలు కలిసి సుమారు రూ. 2 కోట్ల విలువైన స్థలం కబ్జాకు పాల్పడ్డారు. Duplicate documentsతో ఏకంగా Registration చేయించుకుని చివరకు కటకటాల పాలైన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి కథనం ప్రకారం.. సరూర్ నగర్ మండలం ఆర్కే పురానికి చెందిన 71 ఏళ్ల పచ్చిపులుసు వరలక్ష్మి కుమారికి రామంతపూర్ లోని శ్రీరమణపురంలో 267 గజాల ఇంటి స్థలం ఉంది. దీనిని 1983లోనే శ్రీరమణ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు. 2011లో ఆమె భర్త మల్లికార్జునరావు మృతి చెందడంతో అప్పటినుంచి ఆమె సోదరుడు మల్లేశ్వరరావు ఫ్లాట్ను చూసుకుంటున్నారు.
తనే ఏకైక కూతురుని అంటూ….
ఉప్పల్ డివిజన్ లోని చర్చికాలనీ లో ఉండే పసల జ్యోతి (33), మరో కొందరికి ఈ స్థలంపై కన్నుపడింది. దీంతో 2014లోనే వరలక్ష్మి మృతి చెందినట్లు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారం గ్రామం నుంచి Death certificateని సృష్టించారు. ఆమెకు ఏకైక కూతురిని తానేనంటూ జ్యోతి నటించడం ప్రారంభించింది. గతేడాది డిసెంబర్ 3న జ్యోతి తన కూతురు వెన్నెల (19)కి Gift Deed చేసింది. వెన్నెల అదే నెల 9న గొల్లపూడి మరియమ్మకు సేల్ డీడ్ చేసింది. అంతటితో ఆగకుండా అదే నెల 18న మరియమ్మ మళ్లీ పసల జ్యోతితో పాటు, చిలుకా నగర్ లోని ఆదర్శ నగర్ కు చెందిన బల్ల జ్యోతి (27)కి సేల్ డీడ్ చేసింది.
ఇటీవల వరలక్ష్మికి సంబంధించిన వారు ప్లాట్ వద్దకు రావడంతో జ్యోతికి సంబంధించిన వారు ఫ్లాట్ తమదే అన్నారు. దీంతో వారు ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి చూడగా అసలు విషయం తెలిసింది. వాస్తవానికి వరలక్ష్మికి కూతురు, కొడుకు ఉన్నారు. ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఫోర్జరీ సంతకం.. నకిలీ డాక్యుమెంట్లు…
బయ్యారం గ్రామ పంచాయతీ సెక్రెటరీ వరలక్ష్మి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చినట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సమర్పించింది నకిలీది అని పోలీసులు తేల్చారు. పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. అంతే కాకుండా జ్యోతి ఏకైక కూతురినంటూ సృష్టించిన ఆధార్ కార్డు లో కూడా ఆమె భర్త విజయకుమార్ పేరును తొలగించి మల్లికార్జునరావు పేరును చేర్చింది. ఇవన్నీ కూడా నకిలీ ధ్రువీకరణ పత్రాలుగా పోలీసుల విచారణలో తేలింది.
12 మంది పై కేసు..
ఫ్లాట్ కబ్జా కేసులో శుక్రవారం పసల జ్యోతి, ఆమె కూతురు వెన్నెల, బల్ల జ్యోతిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురే కాకుండా బల్ల బలరాం, గొల్లపూడి మరియమ్మ, పసల గ్రెగోరి, జంపరపు ఇమ్మానుయేల్, గొల్లపూడి జోసెఫ్ కుమార్, మమేని ఈంశనమ్మ, గంగారపు శ్రవణ్, మమేని రాయన్న, మల్లికార్జున్ పరారీలో ఉన్నారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
