అభం శుభం తెెలియని చిన్నారిపై జిల్లా హాస్పిటల్లోనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ అమానుషం నాగర్ కర్నూల్ లో చోటుచేసుకుంది. 

నాగర్ కర్నూల్: తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. మహిళలు, యువతులపైనే కాదు అభం శుభం తెలియని మైనర్లనూ వదిలిపెట్టడం లేదు కామాంధులు. ఇటీవల జూబ్లీహిల్స్ యువతి అత్యాచారం తర్వాత ఆడబిడ్డలపై అత్యాచార ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ చిన్నారిపై ఉత్తరప్రదేశ్ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... నాగర్ కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వ హాస్పిటల్ లో చేరింది. ఆమెకు తోడుగా 11ఏళ్ల కూతురు కూడా హాస్పిటల్ కు వచ్చింది. ఇలా తల్లితో పాటే బాలిక కూడా హాస్పిటల్లో వుంది. 

అయితే నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీకి అనుబంధంగావున్న ఈ హాస్పిటల్ ఆదునీకరణ పనులు జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ధీరజ్ (22) అనే యువకుడు పెయింటింగ్ పనులు చేస్తూ హాస్పిటల్ పరిసరాల్లోనే వుంటున్నాడు. ఇతడి కన్ను ఒంటరిగా వున్న బాలికపై పడింది.

శుక్రవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి ఆధునీకరణ పనులు జరుగుతున్న హాస్పిటల్లోకి తీసుకెళ్లాడు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కానీ బాలికను ధీరజ్ తీసుకువెళుతుండగా హాస్పిటల్ సెక్యూరిటీ గార్డు గమనించాడు. అనుమానంతో వెళ్లిచూడగా ధీరజ్ బాలికతో వెకిలిచేష్టలకు పాల్పడటం చూసి ఆస్పత్రి సిబ్బంది, రోగుల బంధువులతో కలిసి నిందితుడిని పట్టుకున్నాడు. అందరూ కలిసి బాలికను కాపాడి నిందితుడికి దేహశుద్ది చేసారు. 

హాస్పిటల్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించగా నిందితుడు ధీరజ్ ను అరెస్ట్ చేసారు. చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇదిలావుంటే విజయవాడలో ఇటీవల ప్రభుత్వాస్పత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్ తీవ్ర సంచలనం సృష్టించింది. మానసిక వికలాంగురాలిని హాస్పిటల్లో బంధించి కొందరు కామాంధలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిత్యం పేషెంట్స్, వారి సహాయకులు, డాక్టర్లు, ఇతర సిబ్బందితో కిటకిటలాడే ప్రభుత్వాస్పత్రిలోనే యువతిని బంధించి అత్యాచారానికి పాల్పడటంతో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తమవడమే కాదు ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 యువతి మానసిక పరిస్థితి గురించి తెలుసుకున్న శ్రీకాంత్ ప్రేమపేరుతో నమ్మించాడు. తనతో వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతి తీసుకుని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్ళాడు. ఓ గదిలో ఆమెను బంధించి మొదట శ్రీకాంత్ అఘాయిత్యానికి పాల్పడగా ఆ తర్వాత మరో ఇద్దరు అత్యాచారం చేసారు.