నాగర్‌కర్నూల్: నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దుండగులు  కిరోసిన్ పోసి నిప్పు అంటించి సజీవ దహనానికి యత్నించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం వట్టిపల్లిలో మంగళవారం నాడు తెల్లవారుజామున చోటు చేసుకొంది.  వట్టిపల్లికి చెందిన ఎద్దుల రఘు, కుటుంబసభ్యుల ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్నారు. 

తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దుండగులు వచ్చి రఘు కప్పుకొన్న దుప్పటిపై కొంత కిరోసిన్  చల్లి ఒక కర్రకు కిరోసిన్ తడిపిన గుడ్డను మట్టి  దానికి నిప్పంటించి దుప్పటిపై విసిరారు. ఈ మంటలకు మేల్కొన్న రఘు తన పక్కనే పెట్టుకొన్న చరవాణిని తీసుకొని పరారయ్యాడు.  రఘు రెండు కాళ్లకు మోకాలు కింది భాగంలో మంటలు అంటుకొన్నాయి. రఘు పక్కనే పడుకొన్న కొడుకు సంతోష్ కూడ స్వల్పంగా గాయపడ్డారు. భూ తగాదాల నేపథ్యంలోనే  తనపై హత్యాయత్నం జరిగిందని రఘు ఆరోపించాడు. ఈ విషయమై రఘు కొందరు గ్రామస్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.