హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీ కేకేను ఓ వ్యక్తి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. కేంద్ర ప్రభుత్వం నుండి రుణాలు ఇప్పిస్తామని చెప్పి మోసానికి యత్నించిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ నెల 24వ తేదీన టీఆర్ఎస్ ఎంపీ కేకేకు మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు.  కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల డిప్యూటీ డైరెక్టర్ నని పరిచయం చేసుకొన్నాడు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీమ్ నుండి 20 మంది వ్యాపారులకు రూ. 25 లక్షల మేర రుణాలు ఇప్పించే అవకాశం ఉందని చెప్పాడు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు తాను ఫోన్ చేశానని చెప్పాడు. దీంతో కేకే తన కూతురు కార్పోరేటర్ గద్వాల్ విజయలక్ష్మితో మాట్లాడాలని కేకే సూచించాడు.

కొందరు వ్యాపారులకు ప్రయోజనం కలుగుతోందనే ఉద్దేశ్యంతో గద్వాల్ విజయలక్ష్మి కొందరిని పిలిపించింది. మహేష్ చెప్పిన పథకం గురించి విచారించింది.ఈ రుణం తీసుకొన్నవారికి 50 శాతం సబ్సీడీ కూడ వస్తోందని చెప్పాడు. దీంతో ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ. 1.25 లక్సలు కట్టాల్సి ఉంటుందని చెప్పారు.

దీంతో ప్రాసెసింగ్ పీజు కట్టేందుకు కొందరు డబ్బులను సిద్దం చేసుకొంటున్నారు. ఇదే సమయంలో కేకేకు అనుమానం వచ్చింది. కేటీఆర్ కు ఫోన్  చేశాడు. కేటీఆర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన పీఏకు కేకే ఫోన్ చేశాడు. కేటీఆర్ ఎక్కడ ఉన్నాడని కేకే ప్రశ్నించాడు. కేటీఆర్ హైద్రాబాద్ లో లేడని ఢిల్లీలో ఉన్నాడన్నారు. అయితే అంతకుముందే మహేష్ కు ఫోన్ చేస్తే తాను కేటీఆర్ వద్ద డీడీలపై సంతకాల కోసం ప్రగతి భవన్ వద్ద ఉన్నట్టుగా చెప్పాడు.

మహేష్ చెబుతున్న మాటలు అబద్దమని కేకే గ్రహించి కూతురు విజయలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు.  అయితే అప్పటికే విజయలక్ష్మి వద్ద ఉండే యువకుడు మేక అఖిల్ కు మహేష్ ఫోన్ చేశాడు. ప్రాసెసింగ్ ఫీజు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో అఖిల్ .. మహేష్ సూచించిన బ్యాంకు అకౌంట్ కు రూ. 50 వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు. మిగిలిన డబ్బులను కూడ పంపాలని ఒత్తిడి చేశాడు.

అయితే ఇదే సమయంలో మోసాన్ని గ్రహించిన విజయలక్ష్మి అఖిల్ కు ఫోన్ చేసింది. అయితే అప్పటికే అఖిల్ తాను డబ్బులు వేసినట్టుగా చెప్పాడు. అయితే  రూ. 50 వేలలో రూ. 40 వేలను అఖిల్ నిజామాబాద్ లో సంజీవ్ అనే వ్యక్తి డ్రా చేశాడు. మిగిలిన రూ. 10 వేలను డ్రా చేసే సమయంలో ఈ బ్యాంకు అకౌంట్ ను బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు.

ఈ విషయమై కార్పోరేటర్ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.