Telangana High Court: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 25.16 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంలో తెలంగాణ హైకోర్టులో హెచ్‌సీయూకి చుక్కెదురైంది.
Telangana High Court: హైకోర్టులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చుక్కెదురైంది. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకునేందుకు సంబంధించి సింగిల్ జడ్జి ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు మొగ్గు చూపలేదు. వివాదాస్పద భూమికి సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సమర్థించింది.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిలో తన ల్యాండ్ ఉందని పేర్కొంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ వివాదానికి తాజాగా పుల్‌స్టాప్ పడింది. తన భూమి ఉందని పేర్కొన్న వ్యక్తికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన భూమిలో 25.16 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వానికి జీవో ఇచ్చే అధికారం ఉందంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాలు కేటాయించగా, ఇందులో తమకు చెందిన భూమి 25.16 ఎకరాలు ఉందని రంగారెడ్డి జిల్లాకు చెందిన లింగమయ్య అనే వ్యక్తి సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాడు.ఈ వివాదం 1982 నాటిది, శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో సర్వే నెం. 14,16,23 లోని సుమారు 25 ఎకరాల భూమి తనకు సంబంధించినది ఉందని పిటిషన్ లో పేర్కొన్నాడు. రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా కోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం లో 1994లో యూనివర్సిటీకి వ్యతిరేకంగా మరో పిటిషన్ దాఖలైంది.
ఇక సివిల్ కోర్టు విచారణ అనంతరం పిటిషనర్ కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సైతం సదరు వ్యక్తికి అనుకూలంగా తీర్పును వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సైతం సమర్థించింది. యూనివర్సిటీ 25.16 ఎకరాలకు బదులు 12.17 ఎకరాలు ఐఐఐటీ, స్పోర్ట్స్ విలేజ్ మధ్య ఇస్తామనగా ప్రైవేటు వ్యక్తి అంగీకరించినప్పటికీ ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం తిరస్కరించింది. ప్రైవేటు వ్యక్తి భూమికి రోడ్డు లేకపోవడంతో తిరిగి సివిల్ కోర్టును ఆశ్రయించగా రోడ్డు ఇవ్వాలని యూనివర్సిటీని ఆదేశించింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవంటూ యూనివర్సిటీ అప్పీలును ధర్మాసనం కొట్టివేసింది.
