నిర్మల్‌: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే ఊచలు లెక్కపెట్టాల్సిందేనని పోలీస్ శాఖ ఎంత చెప్తున్నా యువకుల తీరులో ఏ మాత్రం మార్పురావడం లేదు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్ లకు పలువురు  కటకటాలపాలవుతున్న విషయం తెలిసి కూడా ఇంకా అదే ధోరణిలో పయనిస్తున్నారు. 

తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 

నిర్మల్ జిల్లా ముథోల్‌ మండలం తరోడ గ్రామానికి చెందిన యూనిస్‌ ఖాన్‌ అనే యువకుడు సోషల్‌ మీడియాలో ప్రధానమంత్రి మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. 

ఈ అసభ్యకరమైన పోస్టును భైంసా బీజేపీ నాయకులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. యూనిస్ ఖాన్ ను అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.