ఉప్పల్: తెలంగాణలో ఏర్పడినది ప్రజాకూటమి కాదని స్వార్థ కూటమి అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగాంగా ఉప్పల్ బహిరంగ సభలో పాల్గొన్న గడ్కరీ దేశ అభివృద్ధే లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కృషి చెయ్యలేదని గడ్కరీ విమర్శించారు. 

ఉప్పల్ బీజేపీ అభ్యర్థి ఎన్వీవీఎస్ ప్రభాకర్ మంచి వ్యక్తి అని గడ్కరీ కొనియాడారు. రెండు వేల కోట్ల రూపాయల నిధులో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని స్పష్టం చేశారు. ప్రభాకర్ అభివృద్ధిని చూసి బీజేపీని గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్, టీడీపీల కూటమి స్వార్థప్రయోజనాలతో కూడుకున్నదని అదొక స్వార్థ కూటమి అంటూ ఆరోపించారు. బీజేపీని గెలిపిస్తే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది కేంద్రం చేస్తుందని హామీ ఇచ్చారు. పదవుల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడిన ప్రజాకూటమిని ప్రజలు నమ్మోద్దని గడ్కరీ హితవు పలికారు.