మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి
Mulugu: తెలంగాణలో ₹30,000 కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జీ.కిషన్ రెడ్డి అన్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లిలో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ అభివృద్ధికి తగిన భూమిని అందించలేదని ఆరోపించారు.
BJP Telangana State President Kishan Reddy: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా డప్పులు వాయిస్తూ ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకుని చీరలు, బెల్లం సమర్పించుకున్నారు. మంత్రి పర్యటన ప్రాముఖ్యత దృష్ట్యా ఈ సందర్భంగా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
కేంద్రంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దాదాపు ₹900 కోట్లతో తెలంగాణకు గిరిజన వర్సిటీ కేటాయించి..దానికి సమ్మక్క-సారక్క పేరు పెట్టిన సందర్భంగా ములుగు లోని మేడారంలో సమ్మక్క సారక్క దేవతల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఇదిలావుండగా, అంతకుముందు తెలంగాణలో ₹30,000 కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జీ.కిషన్ రెడ్డి అన్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లిలో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ అభివృద్ధికి తగిన భూమిని అందించలేదని ఆరోపించారు. అన్ని ప్రధాన నగరాలనే కాకుండా దేశంలోని మిగిలిన ప్రాంతాలను దశలవారీగా కలుపుతూ తెలంగాణ అంతటా రైలు నెట్ వర్క్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.
తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారించారనీ, ఈ ఏడాదిలోనే రూ.5 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరుకు మూడు వందేభారత్ రైళ్లను కేటాయించారు. సిద్దిపేట తదితర ప్రాంతాలకు కొత్త రైల్వేలైన్లు ప్రారంభించామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి, చర్లపల్లిలో రాబోయే కొత్త ప్యాసింజర్ టెర్మినల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగినంత స్థలాన్ని అందించలేదని విమర్శించారు. ఎవరు సహకరించినా, సహకరించకపోయినా, టీఆర్ ఎస్ నాయకులు అడ్డంకులు సృష్టించినా ప్రజలకు మేలు జరిగేలా రైల్వే ప్రాజెక్టులతో ముందుకెళ్తామన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభం కాగా, యాదాద్రికి లింక్ పెండింగ్లో ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు తుది సర్వేల్లో ఉన్నాయని మంత్రి వివరించారు.