Asianet News TeluguAsianet News Telugu

ఆదాయం కోసం చూడడం వల్లే ప్రమాదాలు: రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదస్థలాన్నిపరిశీలించిన కిషన్ రెడ్డి


అక్రమంగా  నిర్మించిన భవనాలపై  చర్యలు తీసుకోవాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆదాయం కోసం  అక్రమంగా నిర్మించిన భవనాలను రెగ్యులరైజ్ చేయడం వల్లే  ప్రమాదాలు జరుగుతున్నాయని  ఆయన  అభిప్రాయపడ్డారు. 

Union Minister  Kishan Reddy Visits  Fire Accident  place at Ramgopalpet in Secunderabad
Author
First Published Jan 20, 2023, 11:09 AM IST

హైదరాబాద్:  ఆదాయం కోసం  అక్రమంగా  నిర్మించిన భవనాలు రెగ్యులరైజ్  చేయడం మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సికింద్రాబాద్  రాంగోపాల్ పేటలో డెక్కన్  నైట్ వేర్ స్టోర్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరిగిన  భవనాన్ని మంత్రి  కిషన్ రెడ్డి  శుక్రవారం నాడు పరిశీలించారు.  అనంతరం  ఆయన మీడియాతో  మాట్లాడారు.  సికింద్రాబాద్ ప్రాంతంలో  వరుసగా  అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అగ్ని ప్రమాదాల కారణంగా  గతంలో   చాలా మంది చనిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. జనావాసాల మధ్య  ఈ రకమైన  గోడౌన్లు, వేర్ హౌస్ లు  ఉన్నాయన్నారు. వీటన్నింటిపై సర్వేలు చేయాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.  నిన్న డెక్కన్  నైట్ వేర్  భవనంలో పెద్ద ప్రమాదం జరిగినా  ప్రాణనష్టం  జరగలేదన్నారు. ఇంకా ఈ భవనంలో ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పరిశీలిస్తే  ప్రమాద తీవ్రత తెలియదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

భవనం సెల్లార్ లో  ఇంకా మంటలున్నాయన్నారు.ఈ  ప్రమాదంలో ఎలాంటి ప్రాణపాయం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నట్టుగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. జీహెచ్ఎంసీతో పాటు  రాష్ట్రంలోని  పట్టణాల్లో  ఈ రకమైన గోడౌన్లలో తనిఖీలు  చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  కోరారు. అగ్ని ప్రమాదం కారణంగా ఈ భవనం పక్కనే ఉన్న  ఇళ్లు కూడా దగ్దమయ్యాయన్నారు.జనావాసాల మధ్య  ప్రమాదం జరగడాన్ని  ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. జనావాసాల మధ్య  ఉన్న గోడౌన్లు , స్టోర్స్   వెంటనే ఖాళీ చేయించి  సిటీకి దూరంగా  ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.అక్రమంగా  నిర్మించిన గోడౌన్లు, స్టోర్స్ పై చర్యలు తీసుకోవాలని  ఆయన కోరారు.  

ఆదాయం కోసం  అక్రమంగా  రెగ్యులరైజ్ చేయడం వల్లే  ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.   గతంలో  ఈ ప్రాంతంలో జరిగిన   అగ్ని ప్రమాదాలన్నీ కూడా అక్రమంగా నిర్మించిన భవనాల్లో జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 

also read:రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థత, భవనం కూల్చివేసే చాన్స్

అగ్ని ప్రమాదానికి గురైన భవనం  కూల్చివేసే సమయంలో పక్కన ఉన్న భవనాలకు  నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని  కేంద్ర మంత్రి కోరారు. అగ్ని ప్రమాదం  జరిగిన  పక్క కాలనీలో  నివాసం ఉంటున్న వారికి  తమ పార్టీ తరపున  భోజన వసతి  కల్పించనున్నట్టుగా మంత్రి చెప్పారు. మరో వైపు ఈ కాలనీ వాసులకు  ఇళ్లు కట్టించాలని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios