అరాచకాలు ఆపకపోతే ప్రజలే మిమ్మల్ని అధికారం నుండి దింపుతారు: కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్ తన అరాచకాలను ఆపకపోతే ప్రజలే కేసీఆర్ ను గద్దె దింపుతారని ఆయన చెప్పారు.
హైదరాబాద్: ఇకనైనా మీ కుటుంబ అరాచకాలను ఆపకపోతే ప్రజలే మిమ్మల్ని అధికార పీఠం నుండి తప్పిస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
గురువారం నాడు ట్విట్టర్ వేదికగా కేసీఆర్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు బట్టారు.
గోదావరి వరద నీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌస్ ముంపునకు గురైన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రజా ధనాన్ని కేసీఆర్ సర్కార్ వృధా చేస్తుందని ఈ ఘటన నిరూపిస్తుందని చెప్పారు.రాష్ట్రంలోనిప్రజలపై ఒక్కొక్కరిపై లక్ష రూపాయాలు అప్పు తప్ప మీరేమీ చేశారని కూడా కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో సచివాలయం కూలగొట్టడంతో పాటు విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్ధులు అవస్థలు పడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో నడుస్తుంది కేసీఆర్ ప్రభుత్వం కాదు.. ఫామ్ హౌస్ , ఫ్యామిలీ ప్రభుత్వం నడుస్తుందని ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్ సర్కార్ పాలనలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు పంట నష్టం అడిగిన రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి ఉందని కూడా కిషన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్టు చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కాదన్నారు. ఫామ్ హౌస్, ఫ్యామిలీ ప్రభుత్వమన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే మోడీపై విషం చిమ్మారన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కు బీజేపీ ముచ్చెమటలు పోయిస్తే మోడీపై విమర్శలు చేశారన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి పాలైతే కూడా మోడీనే లక్ష్యంగా విమర్శలు చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు