Asianet News TeluguAsianet News Telugu

దొరికిందని చెబుతున్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?.. బీజేపీలో చేరాలనుకుంటే మధ్యవర్తులు అక్కర్లేదు: కిషన్ రెడ్డి

తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించింది, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీనేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా.. టీఆర్ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 

union minister kishan reddy slams KCR Over Trs Mlas Poaching bid allegations
Author
First Published Oct 27, 2022, 1:38 PM IST

తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించింది, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీనేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా.. టీఆర్ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తాము బ్రోకరిజం చేస్తామని అంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆయన ఏ పార్టీ నుంచి గెలిచారో గుర్తు లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌ ఘటనకు సంబంధించి బీజేపీపై వస్తున్న ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. 

మునుగోడులో ఓటమిని తప్పదని తెలిసి టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. గురవింద గింజ సామెతలాగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫామ్ హౌస్‌లో దొరికిందని చెబుతున్న డబ్బు ఎంత? అది ఎక్కడి నుంచి తెచ్చారనే విషయాలు బయటపెట్టలేదని అన్నారు. ప్రగతి భవన్ నుంచి వచ్చిందా?, ఫామ్ హౌస్ నుంచి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఈ విషయాలను ఇప్పటివరకు బయటపెట్టలేదని అన్నారు. 

Also Read: అప్పుడు రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఫామ్ హౌస్‌లో అదే సీన్.. కానీ అనేక ప్రశ్నలు..

తెలంగాణలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు, రాజకీయ బెదిరింపులతో చేర్చుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలను చేర్చుకుని తెలంగాణలో ఆ పార్టీని భూస్థాపితం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఏ ప్రతిపాదికన చేర్చుకుందని ప్రశ్నించారు. టీడీపీ నుంచి చేర్చుకుని ఏ ప్రతిపాదికన మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. 

టీఆర్ఎస్‌ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 50 శాతం సీట్లు ఓడిపోయిందని అన్నారు. టీఆర్ఎస్ పని అయిపోయిందనే కొత్త నాటకాలకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అయిపోందని కల్వకుంట్ల కుటుంబం ప్రస్టేషన్‌లో ఉందని విమర్శించారు. అధికారం పోతుందని, అధికారంలో ఉండగా చేసిన అక్రమాలపై దర్యాప్తు జరుగుతుందనే భయం వారిని పట్టిపీడిస్తుందని ఆరోపించారు. 

టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు బూమ్ రాంగ్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో మంత్రిపై హత్యాయత్నం జరిగిందని బీజేపీపై ఆరోపణలు చేశారని అన్నారు. మునుగోడులో బీజేపీ నేతలకు కేటీఆర్ ఫోన్ చేస్తే అది నైతికత అవుతుందా అని ప్రశ్నించారు. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దుబ్బాకలో కూడా ఇలాంటి నాటకాలే ఆడారని మండిపడ్డారు.  

Also Read: ఫాం హౌస్ సీసీటీవీ పుటేజీ బయటపెట్టాలి: టీఆర్ఎస్ పై బండి సంజయ్ చార్జీషీట్ విడుదల

ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుంది వాళ్లే, డబ్బులు తెచ్చుకున్నది వాళ్లేనని ఆరోపించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి పోయాయనేది? తెలియాలని అన్నారు. డబ్బుతో పట్టుకున్నామని చెబుతున్న వాళ్లతో బీజేపీకి ఏం సంబంధం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ. 400 కోట్లు ఇస్తానని చెప్పింది ఎవరుని.. అంత డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని ప్రశ్నించారు. 

ఈ నలుగురు ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా? వాళ్లు ఏమైనా ప్రజా బలం ఉన్న నాయకులా? వాళ్లు ముందు ఏ పార్టీలో ఉన్నవాళ్లు? వాళ్లమైనా నీతువంతులా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసు అధికారులు కొందరు దిగజారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఎవరూ ఏ పార్టీలో ఉంటారు.. ఎవరూ ఏ పార్టీలో చేరబోతున్నారు.. ఏ పార్టీ నాయకుడు ఎవరికి ఆశ చూపుతున్నాడు.. అనేది పోలీసుల పనా? ’’ అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే క్యాజువల్‌గా వచ్చానని చెప్పారని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే పార్టీకి వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. తాము 2023 వరకు వేచిచూడటానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. అక్కడ వచ్చినవాళ్లు బీజేపీ వాళ్లు కాదని తెలిపారు. డైరెక్టర్స్ వాళ్లు, మేకర్స్ వాళ్లే.. అంత ప్రభుత్వ డైరెక్షన్‌లోనే జరిగిందని ఆరోపించారు. 

టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే.. వారు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపించాలని డిమాండ్ చేశారు. అప్పుడు వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. లేకుంటే సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. అక్కడికి వచ్చిన వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు.. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నట్టుగా తెలిపారు. 

ఫామ్‌హౌస్‌కు పోలీసులు రాకముందే టీఆర్ఎస్‌ సోషల్ మీడియా కోసం పోస్టులు సిద్దం చేసిందని ఆరోపించారు. ఒక ఉప ఎన్నిక కోసం ఇంత చిల్లర రాజకీయం అవసరమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల పేరుతో సానుభూతి కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే దాడులు చేయిస్తున్నారనే ప్రచారం కల్పిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రధానిని  తిడితేనే జాతీయ నేత అవుతామని కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు చాలా మందితో నందకుమార్ ఫొటోలు దిగారని చెప్పారు. తనతో నందకుమార్ దిగిన ఫోటో చూపించి తన మనిషి అంటే ఎలా అని ప్రశ్నించారు. 8 ఏళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.  కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాలు, సెటిల్‌మెంట్‌లు చేస్తుందని విమర్శించారు. తమ పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే మధ్యవర్తులు అక్కర్లేదని చెప్పారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే తమ పార్టీలోకి  రానిస్తామని తెలిపారు. 

తాము చేరికల కమిటీ ఏర్పాటు చేసుకున్నామని.. అందులో తప్పేం ఉందని చెప్పారు. తమ పార్టీ తరఫున ఏదైనా మాట్లాడే అధికారం చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌కు ఉందన్నారు. స్వామిజీలను, నంద కుమార్‌‌లకు బాధ్యతలు ఇవ్వాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. అక్కడికి వచ్చినవారిని ఏం చేసుకున్న తమకు సంబంధం లేదన్నారు. 

కేసీఆర్‌కు యదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి మీద విశ్వాసం ఉంటే.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాలును స్వీకరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను ఎందుకు పోలీసు స్టేషన్‌కు ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అంత గమనిస్తున్నారని.. ప్రతి దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తప్పుడు చేయనప్పుడు తాము ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. బీజేపీలోకి చేర్చుకోవాలంటే తామే మాట్లాడతామని.. ఇలా స్వామిజీలను ఎందుకు పంపుతామని ప్రశ్నించారు. ఇదేమన్న దొంగతనమా? అని ప్రశ్నించారు. వాళ్లు చేస్తే నీతి.. తాము చేస్తే మాత్రం అవినీతా అంటూ మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios