అప్పుడు రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఫామ్ హౌస్‌లో అదే సీన్.. కానీ అనేక ప్రశ్నలు..

టీఆర్‌ఎస్‌‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణలో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ సీన్ చూసినవారికి 2015లో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ గుర్తుకు రాక మానదు.

Police Foils Poaching Bid On Four TRS MLAs recollects 2015 Revanth Reddy Incident but no answer for These questions

టీఆర్‌ఎస్‌‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త తెలంగాణలో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి‌లు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అయితే ఈ సీన్ చూసినవారికి 2015లో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ గుర్తుకు రాక మానదు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వ్యతిరేకంగా ఓటు వేస్తానని చెప్పిన నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఇంటికి అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి వెళ్లాడు. అక్కడ రేవంత్ రెడ్డిని పట్టుకునేందుకు పక్కా స్కెచ్ వేసి ఉంచారు. రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ సన్‌తో సంప్రదింపులు జరుపుతున్న దృశ్యాలను రికార్డు చేశారు.  రేవంత్‌ డబ్బుల ఎరగా చూపడం, స్టీఫెన్‌సన్‌‌తో జరిపిన సంభాషణను రికార్డు చేశారు. అనంతరం సడన్ ఎంట్రీ ఇచ్చి రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

కొద్దిసేపటికే అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా టీవీ ప్రసారం అయ్యాయి. రేవంత్, స్టీఫెన్‌సన్‌‌తో జరిపిన సంభాషణ.. బ్యాగులో తీసుకొచ్చిన దృశ్యాలు బయటకు రావడంతో.. రేవంత్ జరిగిన ఘటనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. ఈ ఘటన అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికరంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి కొన్ని వారాల పాటు రేవంత్ రెడ్డి జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఆ కేసు రేవంత్ రెడ్డిని వెంటాడుతూనే ఉంది. 

‘‘స్టీఫెన్‌సన్ వ్రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా రేవంత్ రెడ్డిని ట్రాప్ చేశాం. తెలంగాణ అసెంబ్లీలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తనకు ₹ రూ. 5 కోట్లు, దేశం విడిచి వెళ్లడానికి టిక్కెట్టు(లేదా టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని) ఆఫర్ చేశారని స్టీఫెన్ సన్ ఆరోపించారు. తాము ఆడియో/వీడియో రికార్డింగ్ రూపంలో స్పష్టమైన సాక్ష్యాలను సేకరించాం.  స్టీఫెన్‌సన్‌కు ఆఫర్ చేసిన రూ. 50 లక్షల అడ్వాన్స్ మొత్తాన్ని కూడా రికవరీ చేశాం’’ అని తెలంగాణ పోలీసు అవినీతి నిరోధక శాఖ ఆ సమయంలో తెలిపింది. 

సరిగ్గా ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హస్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు.. రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌‌ కూడా ఉన్నారు. అయితే వారి మధ్య దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా రికార్డు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఫామ్‌మౌస్ ఎమ్మెల్యేలు, సంప్రదింపులు జరిపినట్టుగా చెబుతన్నవారు ఉన్న దృశ్యాలు మాత్రం ఒక్కసారిగా మీడియాలో ప్రసారం అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అక్కడికి చేరుకున్నారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడి చేసినట్టుగా స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.  పక్కా ప్రణాళిక ప్రకారం వల పన్ని ఈ ఆపరేషన్‌ నిర్వహించామని, ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అయితే వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ పోలీసులు ఆ విషయాన్ని నిర్ధారించలేదు. 

అయితే తాజా ఘటన 2015లో చోటుచేసుకున్న రేవంత్ రెడ్డి వ్యవహారం మాదిరిగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ పలు ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం రాజకీయంగా మరింత హీట్‌ను పెంచింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు బీజేపీ రూ. 100 కోట్లు ఆఫర్ చేసిందని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించగా.. ఈ విషయంలో పోలీసుల నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేదు. మరోవైపు ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.  ఈ వ్యవహారానికి పూర్తి  స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రగతిభవన్ నుంచి  నడిచిందని, సీఎం కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాము సేకరించిన ఆధారాలపై పోలీసుల పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే పలువురు అభిప్రాయపడుతున్నారు. తొలుత రోహిత్ రెడ్డిని సంప్రదింపులు జరిగాయని.. ఆ తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ వ్యవహారం జరిగిన తర్వాత రోహిత్ రెడ్డి మినహా.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యే అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. ఆ తర్వాత కొంతసేపటికి రోహిత్ రెడ్డి కూడా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. దీనిపై విపక్షాల నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

పోలీసులు ఎంత డబ్బు సీజ్ చేశారనే విషయంలో రాని స్పష్టత.. 
గతంలో రేవంత్ రెడ్డి వ్యవహారంలో డబ్బులతో కూడిన వీడియోలు వెలుగులోకి రాగా.. ఇంకా డబ్బులు చేతులు మారుతున్నట్టుగా ఎలాంటి వీడియోలు ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే నిందితులు ఫోన్‌లో ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఫామ్ హౌస్‌ వద్ద ఉన్న టీఎస్‌07హెచ్‌ఎం2777 కారులో ఉన్న బ్యాగుల్లో.. రూ. 15 కోట్లు ఉన్నాయనే ప్రచారం సాగింది. అయితే ఆ కారులో ఉన్న బ్యాగుల్లో నగదు ఉందా? అనేది పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. 

అలాగే ఈ వ్యవహారంలో ఎంత నగదు సీజ్ చేశారనే విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించకపోవడంపై సోషల్ మీడియాలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపరేషన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలిసే జరిగిందా?.. లేక కేసీఆర్ ఆదేశాలతో నిఘా ఉంచిన పోలీసులు సోదాలు చేశారా?.. ఎమ్మెల్యేలు డబుల్ గేమ్ ఆడారా..?, ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నంలో అవతలి పార్టీ తొందరపాటు చర్యలకు పాల్పడిందా..?  అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.   మరి రాబోయే రోజుల్లో ఈ ఘటన ఎలాంటి మలుపు తిరుగుతుందో.. ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios