హైదరాబాద్:  బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

శుక్రవారంనాడు ఆయన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు రోడ్ షో ల్లో టీఆర్ఎస్ పై ఆయన విమర్శలు గుప్పించారు.కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. 

also read:మీ ఓట్లతో కేసీఆర్ అహంకారానికి బుద్ది చెప్పాలి: దుబ్బాకలో బండి సంజయ్

పేదలకు అందిస్తున్న రూపాయి కిలో బియ్యంలో కేంద్రం రూ. 32 భరిస్తోందన్నారు. కేసీఆర్ మాత్రం కేవలం రూ. 2 లు మాత్రమే భరిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ ఓట్లు దండుకొన్నారన్నారు.

 కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత  రాష్ట్రం అప్పుల పాలైందని ఆయన విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రైతులకు అప్పులు ఇస్తోందని ఆయన చెప్పారు. కేసీఆర్ సర్కార్ రైతులకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలన్నారు. కానీ పావలా వడ్డీకి కేసీఆర్ ఎందుకు రుణాలు ఇవ్వలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

పంటల భీమా పథకాన్ని  కేసీఆర్ సర్కార్ సరిగా అమలు చేయడం లేదని  కిషన్ రెడ్డి విమర్శించారు. మోడీ సర్కార్ కు మంచి పేరు వస్తోందనే భయంతోనే ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.