బీఆర్ఎస్ పార్టీకి వందలు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బెదిరింపులకు పాల్పడి అక్రమంగా వేల కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు.  

విపక్షాలకు నిధులు అందించే స్థాయికి బీఆర్ఎస్ ఎలా చేరిందని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ పార్టీకి ఇన్ని వందలు, వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. పార్టీలకి ఫండ్స్ ఇస్తున్నారంటే అన్ని డబ్బులు ఎక్కడివని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బెదిరింపులకు పాల్పడి అక్రమంగా వేల కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. బీజేపీని ఓడిస్తామని బీఆర్ఎస్ పగటి కలలు కంటోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వుందని, ఆ పార్టీని బ్రహ్మాదేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్యానించారు. ఎంఎంటీఎస్ హైదరాబాద్‌కు ఎంతో అవసరమన్న కిషన్ రెడ్డి.. సెకండ్ ఫేజ్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఎంఎంటీఎస్ హైదరాబాద్‌కు ఎంతో అవసరమన్న ఆయన.. అది అది కామన్‌మేన్ ట్రైన్‌గా అభివర్ణించారు. ప్రతి నిత్యం ఉద్యోగులు, కార్మికులు, నిరుపేదలు దానిలో ప్రయాణిస్తారని తెలిపారు. 

ALso Read: బీఆర్ఎస్‌ను ఈసారి బ్రహ్మాదేవుడు కూడా కాపాడలేడు .. 8న మోడీ సభతో తెలంగాణలో పెనుమార్పులు : కిషన్ రెడ్డి

ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ డిమాండ్‌కు స్పందించి.. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడి లేదని.. ఎంఎంటీఎస్ నిర్మాణానికి సంబంధించి సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. రోజులు గడుస్తుండటంతో ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందని.. చివరికి దీనిపై తానే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. తన అభ్యర్ధన మేరకు ఎంఎంటీఎస్‌ ఫేజ్‌ 2ను పూర్తిగా కేంద్రమే తీసుకుందని ఆయన తెలిపారు. ఫేజ్ 2లో కొత్తగా 13 రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే చెబుతామన్నారు.

బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చామని కిషన్ రెడ్డి చెప్పారు. అది పాత భవనం కావడంతో ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి వుందన్నారు. రూ.1366 కోట్లతో ఎయిమ్స్ నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. టెండర్లు పూర్తయ్యాయని.. కాంట్రాక్టర్ కూడా రెడీగా వున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే భూమిని చదును చేసే పనులు పూర్తి చేశామని.. 8న ప్రధాని మోడీ ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. రూ.7866 కోట్లతో తెలంగాణలో జాతీయ రహదారులకు సంబంధించిన పనులను ప్రారంభిస్తామన్నారు.