Asianet News TeluguAsianet News Telugu

ఆ ఆడియోలు బోగస్ ... స్వామిజీతో బీజేపీకి సంబంధం లేదు : తేల్చేసిన కిషన్ రెడ్డి

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. స్వామిజీతో బీజేపీకి సంబంధం లేదని... నేతలు పార్టీలు మారడం ఇదేమైనా కొత్తా అని ఆయన ప్రశ్నించారు. 

union minister kishan reddy response on audio tapes over MLA poaching case
Author
First Published Oct 28, 2022, 5:34 PM IST

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి శుక్రవారం మీడియాలో హల్ చల్ చేసిన ఆడియో టేపులు మరింత కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆడియోలు ఉత్త బోగస్‌గా కొట్టేశారు. స్వామిజీతో బీజేపీకి సంబంధం లేదని... నేతలు పార్టీలు మారడం ఇదేమైనా కొత్తా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

ఇకపోతే.. ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశానికి సంబంధించి రామచంద్ర భారతి పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య  జరిగిన ఆడియో సంభాషణను ప్రముఖ  తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. ఈ నెల 26న ఫాంహౌస్ మీటింగ్‌‌కు ముందే ఈ సంభాషణ  జరిగిందని ఆ కథనంలో పేర్కొంది. ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని రామచంద్రభారతి కోరినట్లుగా ఆడియో సంభాషణలో ఉంది. తన వద్ద నందకుమార్  ఈ అంశం ప్రతిపాదించినట్టుగా చెప్పారు. సమావేశానికి హైద్రాబాద్ మంచి ప్లేస్ అని రోహిత్ రెడ్డి  చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల నిఘా ఉందని రోహిత్ రెడ్డి రామచంద్రభారతికి చెప్పారు. తనతో పాటు  ముగ్గురు  ఎమ్మెల్యేలు  రెడీగా ఉన్నారని రోహిత్ రెడ్డి  రామచంద్రభారతితో అన్నట్టుగా ఆడియోలో  ఉంది. 

ALso REad:ఎవరెవరికి ఎంతివ్వాలి: రామచంద్రభారతి, నందకుమార్ ,సింహయాజీల ఫోన్ సంభాషణ

ఆ కాసేపటికే మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల ప్రలోభాల అంశానికి సంబంధించి శుక్రవారం నాడు రెండో ఆడియో విడుదలైంది. ఈ ఆడియోలో రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ల మధ్య సంభాషణ జరిగినట్టుగా ఉంది. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలనే దానిపై చర్చించుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు రావడానికి సిద్దంగా ఉన్నారని ఈ సంభాషణల్లో తేలిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం  ప్రసారం చేసింది. వారు 100 ఆశిస్తున్నారని సదరు ఆడియోలో ఉంది. 

పైలెట్ రోహిత్ రెడ్డి తనతో పాటు నలుగురికి తీసుకొచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఈ సంభాషణల్లో ఉంది. పైలెట్ రోహిత్ రెడ్డికి 100, మిగిలినవారికి నామమాత్రంగా ఇస్తే సరిపోతుందని ఆ సంభాషణ చెబుతుంది. రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దలను కలిపిస్తామని చెప్పామని ఆ  కథనం ప్రసారం చేసింది. దాదాపు 27 నిమిషాల  పాటు  ఈ సంభాషణ జరిగింది. మునుగోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇది జరిగిపోతుందని రామచంద్రభారతి అన్నట్టుగా ఈ సంభాషణ ఉందని ఈ కథనం తెలిపింది. మునుగోడు ఉప ఎన్నికకు ముందే అయితే 100కు రావడానికి వాళ్లు ఒకే అంటున్నారని చర్చించుకున్నట్టుగా ఉందని ఈ  కథనం వివరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios