Asianet News TeluguAsianet News Telugu

అంకెలు, మాటల గారడీ .. బీఆర్ఎస్ చేసినట్లే : తెలంగాణ బడ్జెట్‌పై కిషన్ రెడ్డి స్పందన

2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీలు అమలు కానట్లేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 
 

union minister kishan reddy reacts on telangana budget 2024 ksp
Author
First Published Feb 10, 2024, 6:36 PM IST

2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. రూ.2,75,891 కోట్లతో తెలంగాణ  ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటించారు. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పాలన అంకెల గారడీ, మాటల గారడీ అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్‌లో ఎక్కువ పేజీలు కేటాయించారని, ఎన్నికల్లో వాగ్ధానాల కోసం కేటాయింపులు లేవని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని.. సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.28 వేల కోట్లు సరిపోవని ఆయన ఎద్దేవా చేశారు. బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు కేటాయించి బీసీలను మోసం చేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.28 వేల కోట్లు సరిపోవని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీలు అమలు కానట్లేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని .. రైతుభరోసా, రుణమాఫీ, పంట బీమాకు నిధుల ప్రస్తావన ఏదని కేంద్ర మంత్రి నిలదీశారు. రైతు బీమా , వడ్డీ లేని పంట రుణాలకు కేటాయింపులు ఏవని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

అంతకుముందు తెలంగాణ బడ్జెట్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లకుపైగా అవసరం అని.. కానీ, బడ్జెట్ లో హామీల అమలు కోసం కేటాయించిన నిధులు రూ.53 వేల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. బడ్జెట్ సాక్షిగా.. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా వంచించిందని అన్నారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని.. పూర్తిగా విస్మరించిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతనేలేదన్నారు. 

ఎన్నికల హామీలను నెరవేర్చలేమని బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. పీవీ నర్సింహారావును దారుణంగా వంచించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. పీవీ చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరపని నీచమైన పార్టీ కాంగ్రెస్ అని, పీవీ ఘాట్ ను కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే కనీసం నోరుమెదపని పార్టీ కాంగ్రెస్ అని, పీవీ ఘాట్ పై చేయి వేస్తే దారుస్సలాంను కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చిన పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. 

బండి సంజయ్ కు అండగా మోదీ, రాముడు ఉన్నారని చెప్పుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాన రజాకార్ల పార్టీ, రాక్షసుల పార్టీ అండగా ఉందని అన్నారు. రామరాజ్యం కోసం తపిస్తున్న మోదీ పాలన కావాలా?... రజాకార్ల రాక్షసులకు వత్తాసు పలుకుతున్న రాహుల్ పాలన కావాలా? అని ప్రశ్నించారు. నిరంతరం ప్రజల కోసం పోరాడే బండి సంజయ్ కావాలా?... విహార యాత్రల మాదిరిగా అప్పడప్పుడు వచ్చే నేతలు కావాలా? అన్నారు.  రాముడి వారసుల పార్టీ కావాలా?.... రాక్షస వారసుల పార్టీలు కావాలా?, దేవుడిని నమ్మే బీజేపీ కావాలా? దేవుడిని నమ్మకుండా హేళన చేసే పార్టీలు కావాలా? అంటూ సూటి ప్రశ్నలు సంధించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios