తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే బోనాల పండగను కేంద్ర పండగల జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. 

న్యూడిల్లీ: తెలంగాణ ప్రజలు మరీముఖ్యంగా రాజధాని హైదరాబాద్ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పండగ ఆషాడమాస బోనాలు. ఈ పండగను కేంద్ర ప్రభుత్వ పండగల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 

న్యూడిల్లీ తెలంగాణ భవన్ లో హైదరాబాద్ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంవారు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనంతో పాటు పట్టువస్త్రాలను సమర్పించారు కిషన్ రెడ్డి. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి బంగారు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు. 

read more బోనాలు ప్రారంభం

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశిస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వుండాలని కోరుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 

 తెలంగాణభవన్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కిషన్‌రెడ్డి సందర్శించారు. బోనాల కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కేశవరావు, మాజీమంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు.