తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంపై బురదజల్లేందుకు కేసీఆర్ అసెంబ్లీని వాడుకున్నారని విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంపై బురదజల్లేందుకు కేసీఆర్ అసెంబ్లీని వాడుకున్నారని విమర్శించారు. అసెంబ్లీలో దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ధరణి పోర్టల్ గురించి కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్‌కు అవగాహన లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలలో మోదీ ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే తెలంగాణ ప్రగతిపై రాష్ట్ర అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబ మంత్రులు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తిరుమలరాయుని పిట్టకథ కేసీఆర్‌కే వర్తిస్తుందని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ద్వేషంతో విష ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం కూరుకుపోయిందని.. ప్రపంచానికి తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడే భాష పద్దతిగా ఉండాలని.. కల్వకుంట్ల కుటుంబం భాష మాట్లాడొద్దని అన్నారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు.

ఆధారాలు లేకుండా కేంద్రంపై కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు భజన చేయడమే మంత్రులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాజీనామాపై కేసీఆర్‌కు తొందర ఎందుకని.. ఇంకా ఏడు నెలల్లో ఆయన దిగిపోతారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్‌భవన్‌లో రాజీనామా లేఖ ఇవ్వకతప్పదని చెప్పుకొచ్చారు. 

దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు కేసీఆర్ సిద్దమా అని కిషన్ రెడ్డి సవాలు విసిరారు. కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడ చర్చకు వస్తానని అన్నారు. ప్రెస్ క్లబ్‌కు రమ్మంటారా? ఫామ్ హౌస్‌కు రమ్మంటారా? గన్ పార్క్‌కు రమ్మంటారా? ప్రగతి భవన్‌కు రమ్మంటారా? అని ప్రశ్నించారు. రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని వస్తారా? అని ప్రశ్నించారు. అప్పులు చేసి కమిషన్లు కొట్టేసే ప్రభుత్వం కేంద్రంలో లేదన్నారు. రాష్ట్రంలో మాత్రం ప్రాజెక్టుల పేరుతో వేలకోట్ల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ఇతర దేశాలతో పోలుస్తూ భారతదేశాన్ని విమర్శించడం కల్వకుంట్ల కుటుంబానికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుంటే గూగుల్‌లో సెర్చ్ చేయాలని అన్నారు.