కేసీఆర్ కే నోబెల్ బహుమతి ఇవ్వాలి.. కేటీఆర్ కు కిషన్ రెడ్డి కౌంటర్...

అబద్ధాలు, అవినీతి ఇలా వివిధ రంగాలకు గానూ, నోబెల్ బహుమతి తీసుకునే అర్హత కేసీఆర్ కే ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. 

Union Minister Kishan Reddy is counter to Minister KTR


హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధానికి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. దీనికి కౌంటర్ గా కేసీఆర్ కే నోబెల్ బహుమతులు ఇవ్వాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా టీకా విషయంలో మోడీ చేసిన కృషి, తీసుకున్న చొరవ, భారతీయులతో పాటు యావత్ ప్రపంచానికి బాగా తెలుసునని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

కెసిఆర్ వివిధ రంగాల్లో అపారమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్నందుకుగానూ.. నోబెల్ బహుమతులు ఇవ్వాల్సిందే అన్నారు. కరోనా చికిత్స కు పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అన్నందుకు.. వైద్యరంగంలో కెసిఆర్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలని అన్నారు. అబద్ధాలు, అవినీతి ఇలా వివిధ రంగాలకు గానూ, నోబెల్ బహుమతి తీసుకునే అర్హత కేసిఆర్ కే ఉందని కిషన్ రెడ్డి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 

తెలంగాణ బిడ్డల్ని నూకలు తినమంటారా .. వీళ్ల తోకలు కట్ చేద్దామా: బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం

ఇదిలా ఉండగా, అక్టోబర్ 16న కూడా కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్.. తాను మాత్రం విమానాలు కొన్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. తెలంగాణ పోరాటంలో పన్నెండు వందల మంది ప్రాణత్యాగాలు చేశారని..అవన్నీ కెసిఆర్ కుటుంబం కోసమా అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. విమానాల్లో తిరుగుతూ తెలంగాణలో సంపాదించిన డబ్బులు కెసిఆర్ దేశమంతా పంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ టిఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారు అని కిషన్రెడ్డి ఆరోపించారు.

అంతకుముందు సోమవారంనాడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కల్వకుంట్ల కుటుంబం అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. ప్రజలు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారెవరూ ప్రస్తుతం టిఆర్ఎస్ లో లేరని అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో టిఆర్ఎస్ ఏర్పడిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పన్నెండు వందలమంది అమరుల త్యాగాల మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిందని ఆయన గుర్తు చేశారు.

కుటుంబ పాలనను ప్రజలపై రుద్దుతున్నారు. కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపేలా తన పార్టీ పేరులో తెలంగాణను కూడా తొలగించారు అని కెసిఆర్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కెసిఆర్ సర్కార్ పని చేయడం లేదన్నారు. తెలంగాణలో సమస్యలు పరిష్కరించినట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కెసిఆర్ అహంకారానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మునుగోడులో టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ అవినీతి కుంభకోణాలకు ప్రజలే మీటర్లు పెట్టారని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios