బీజేపీపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నూకలు తినమన్న వారి తోకలు కట్ చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఒక రాజగోపాల్ రెడ్డి ధనవంతుడైతే నల్గొండ జిల్లా రైతు బిడ్డల ఆదాయం పెరగదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రైతు అవగాహన సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకుండా, నల్గొండ మొత్తానికి ఇచ్చుంటే తాము పోటీలో నుంచి తప్పుకుంటామని చెప్పామని కేటీఆర్ గుర్తుచేశారు. రైతు ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకుని ఫిషరీస్ రంగంలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచినట్లు కేటీఆర్ తెలిపారు.
రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి గంగపుత్రులకు వలలు, మోపెడ్‌లు, బోట్లు కొనిచ్చి, చేప పిల్లలను ఇవ్వడం ద్వారా ఇంతటి అభివృద్ధి జరిగిందని మంత్రి గుర్తుచేశారు. నాడు తెలంగాణలో రైతులు పుట్టెడు దు:ఖంలో వున్నారని.. నేడు పుట్ల కొద్ది వడ్లు పండుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఇంత ధాన్యాన్ని తాము కొనలేమని కేంద్రం చేతులెత్తేసే స్థాయికి చేరుకుందని మంత్రి చెప్పారు. ఆహార భద్రత చట్టం కింద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తాము కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరామని.. కానీ మేం చమత్కారాలు చేస్తున్నామని అవమానించేలాగా మాట్లాడారని కేటీఆర్ మండిపడ్డారు.
ALso REad:రైతుల జోలికి వస్తే కేంద్రాన్ని తెలంగాణ మట్టి క్షమించదు: మంత్రి కేటీఆర్ వార్నింగ్
రైతు బంధు, 24 గంటలూ కరెంట్, చెరువులు బాగు చేసుకున్నామని, రైతు బీమా, కొత్త ప్రాజెక్ట్‌లు కడుతున్నామని ... అందుకే తెలంగాణలో వ్యవసాయ విస్తరణ సాధ్యమైందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ బిడ్డల్ని పీయూష్ గోయల్ నూకల్ని తినమన్నారని ఆయన మండిపడ్డారు. నూకలు తినమన్న వారి తోకలు కట్ చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంపై మూడు నల్ల చట్టాలు తెస్తే.. ఉత్తర భారతదేశంలో రైతులు 13 నెలల పాటు రోడ్ల మీద కూర్చొని కొట్లాడారని మంత్రి ప్రశంసించారు. 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రధాని మోడీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పి, చట్టాలను వెనక్కి తీసుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
అయినప్పటికీ మారకుండా మరో మూడు కిరికిరి చట్టాలను తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. బావుల దగ్గర మీటర్లు పెట్టమంటున్నారని, అవి ప్రీపెయిడ్ మీటర్లని కేటీఆర్ తెలిపారు. ఇలా చేయిస్తే రాష్ట్రాలకు అదనంగా రూ.5 వేల కోట్లు ఇస్తామన్నారని... కానీ తన గొంతులో ప్రాణం వుండగా ఎట్టి పరిస్ధితుల్లో బావి కాడ మీటర్ల పెట్టనీయనని తేల్చిచెప్పారని ఆయన తెలిపారు. మీటర్లు పెడితే చాలా ప్రమాదమన్న కేటీఆర్.. ఎస్పీడీసీఎల్, ఎంపీడీసీఎల్‌ను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇవన్నీ ఒక వ్యక్తి దగ్గరకే వెళ్తాయని.. కరెంట్ ఛార్జీలు పెరుగుతాయని అన్నారు.
