Asianet News TeluguAsianet News Telugu

అన్నీ మాటలే.. చేతలు ప్రగతి భవన్ గోడలు దాటవు: కిషన్ రెడ్డి కామెంట్లు

టీఆర్ఎస్ పార్టీ ఐదేళ్ల పనితీరుపై ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి. 

union minister Kishan Reddy fires on kcr an ktr over development in Hyderabad ksp
Author
Hyderabad, First Published Nov 17, 2020, 7:58 PM IST

టీఆర్ఎస్ పార్టీ ఐదేళ్ల పనితీరుపై ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి. నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చి వాటిని విస్మరించిందని ఆయన విమర్శించారు.

సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నానని చెప్పిన కేసీఆర్‌, దానిపై ఎప్పుడైనా సమీక్షించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ ఎలా ఉండాలో చూపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

ఇప్పటివరకు పాతబస్తీకి మెట్రో వెళ్లకుండా చేసి టీఆర్ఎస్- ఎంఐఎలు పాపం మూటగట్టుకున్నాయని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. తాత్కాలిక తాయిలాలు ఇచ్చి టీఆర్ఎస్ ఓట్లు పొందాలని చూస్తోందని.. అబద్ధపు ప్రచారాలు ఇంకెన్నాళ్లు చేస్తారని కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:హరీష్ రావు ఖాతాలో దుబ్బాక ఓటమి: జిహెచ్ఎంసీ ఎన్నికలు కేటీఆర్ కు అగ్నిపరీక్ష

టీఆర్ఎస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం ప్రగతి భవన్‌ గోడలు దాటడం లేదని ఆయన సెటైర్లు వేశారు. ఇది భాగ్యనగరమా లేక విషాద నగరమా అనేలా పరిస్థితులు తయారయ్యాయని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తండ్రి, కొడుకుల పాలనలో నగరంలో అభివృద్ధి తక్కువ.. ఆర్భాటం ఎక్కువలా మారిందని ఆయన దుయ్యబట్టారు. చివరికి వరద సాయాన్ని కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు గద్దల్లా తన్నుకుపోయారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్‌ ప్రజలు చైతన్యవంతులని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ దుబ్బాక తరహా ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికలు నిర్వహించాలని కిషన్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ మేయర్‌ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ బరిలో దిగుతుందని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నాయకులకు మద్దతుగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు.

దుబ్బాక నుంచి టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని.. గ్రేటర్‌ ఫలితాలతో కల్వకుంట్ల పాలనకు స్వస్తి పలకాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసే విషయాన్ని చర్చించి ప్రకటిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios