హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికలు మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అగ్నిపరీక్షనే. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు కేటీఆర్ కు అంత సులభం కాకపోవచ్చు. దుబ్బాక ఫలితంతో జోష్ మీదున్న బిజెపి హైదరాబాదు ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది.

దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ప్రభావం కేటీఆర్ మీద పడలేదు. ఆయన ఈ ఎన్నికల్లో అసలు జోక్యం చేసుకోలేదు. అంతా తానై మంత్రి హరీష్ రావు వ్యవహరించారు. దాంతో దుబ్బాక ఓటమి హరీష్ రావు ఖాతాలో పడింది. దుబ్బాకలో బిజెపి అంత గట్టి పోటీ ఇస్తుందని తొలుత ఎవరూ అనుకోలేదు. ఆ తర్వాత గట్టి పోటీ ఇస్తుందని పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో అంచనా వేశారు. అయితే, చివరికి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. ఇది అవునన్నా, కాదన్నా టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ.

Also Read: జిహెచ్ఎంసీ ఎన్నికలు: పవన్ కల్యాణ్ కు బండి సంజయ్ షాక్

దుబ్బాక ఫలితం అక్కడికే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా టీఆఠ్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంచనా వేస్తున్నారు హైదరాబాదులో మజ్లీస్ బలంగా ఉండడం, ముస్లిమేతరులను కూడగట్టడానికి బిజెపి తగిన వ్యూహరచన చేసుకోవడం, పలువురు ప్రముఖ నేతల సేవలు వాడుకోవడానికి సిద్ధపడడం ఒక రకంగా టీఆర్ఎస్ ను కలవరపెట్టే విషయమే.

అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బహుముఖ పోటీ జరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెసు, మజ్లీస్, టీఆర్ఎస్, బిజెపి, టీడీపీ, జనసేనలు పోటీకి దిగుతున్నాయి. ఈ బహుముఖ పోటీ ఎవరికి ఉపయోగపడుతుందనేది ఓ ప్రశ్న. ప్రతిపక్షాల ఓట్లు చీలి టీఆర్ఎస్ లాఫడుతుందా అనేది మరో ప్రశ్న. బిజెపి అంచనా వేసుకున్నట్లు దుబ్బాకలో మాదిరిగానే జరుగుతుందని అనుకుంటే ఆ పార్టీ లాభపడుతుంది. టీఆర్ఎస్ మీద నిజంగానే వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షాల ఓట్లు అధికార పక్షానికి వ్యతిరేకత కారణంగా సమీకృతమైతే మాత్రం బిజెపికి ప్రయోజనం చేకూరవచ్చు. 

Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలు: పోటీకి జనసేన రెడీ

ఆ పనిచేయడానికి బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తోంది. మజ్లీస్ ను తన ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడాన్ని బట్టి హిందూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు. ఈ స్థితిలో కేటీఆర్ కు జిహెచ్ఎంసీ ఎన్నికలు అగ్నిపరీక్షనే కానున్నాయి.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించవచ్చుననే ప్రచారం సాగుతోంది. కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ గా ఇప్పటికే ముందుకు వచ్చారు. అయితే, ఇప్పుడు తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం అత్యంత అవసరం.