హైదరాబాద్: సమగ్రమైన వ్యవసాయ విధానం ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.సోమవారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు నష్టం చేకూర్చే విధానాన్ని కేంద్రం తీసుకోదని ఆయన హామీ ఇచ్చారు.

వ్యవసాయ చట్టాలపై ప్రధానమంత్రి మోడీ స్పష్టత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులకు ప్రయోజనం కల్పించే ఉద్దేశ్యంతోనే కేంద్రం నూతన  వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని ఆయన చెప్పారు.

పాత విధానాలతో రైతులకు ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు.  రాష్ట్రంలో మూత పడిన యూరియా పరిశ్రమలను పునరుద్దరించి రైతులకు యూరియాను అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.

also read:నూతన వ్యవసాయ చట్టాలు: దేశ వ్యాప్తంగా రైతుల నిరహారదీక్షలు

రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి కిసాన్ బ్రాండ్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు త్వరలో యూరియాను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు సరఫరా చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వన్ నేషన్ వన్ గ్రిడ్ కింద విద్యుత్ సమస్యను పరిష్కరించినట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. రైతులకు సాగుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టీవీ ఛానల్ ను తీసుకొచ్చామన్నారు.