హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో గుంతలు లేని రోడ్లను చూపిస్తే తాను లక్ష రూపాయాలు ఇస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ చేశారు.

ఆదివారం నాడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రోడ్లపై గుంత చూపిస్తే వెయ్యి రూపాయాలిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఈ సవాల్ విసిరారు. 

రూ.67 వేల కోట్లను హైద్రాబాద్ అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రభుత్వం నగరంలోని రోడ్లపై గుంతలను ఎందుకు పూడ్చలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్‌తో బీజేపీకి విడదీయలేని అనుబంధం ఉందని ఆయన చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ కట్టారు.. ఎవరికిచ్చారో చెప్పాలని ఆయన టీఆర్ఎస్ ను ప్రశ్నించారు. 

హైద్రాబాద్ ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బీజేపీ వారి వెంటే నిలబడిందని ఆయన చెప్పారు. గత నెలలో కురిసిన వర్షానికే  హైద్రాబాద్ నగరం ఓ మహా సముద్రంలా మారిందన్నారు. 

చిన్నపాటి వర్షానికే రాజ్ భవన్ ముందు నీళ్లు ఆగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే 6 లక్షల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయన్నారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లిస్తారనే ఆశతో ప్రజలు 2016లో గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ కు ఓటేశారని ఆయన చెప్పారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ కట్టారు, ఎవరికిచ్చారనే విషయమై ప్రజలు టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని ఆయన కోరారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఓట్లడిగే హక్కు లేదన్నారు.

ఐడీహెచ్ కాలనీలో కట్టిన ఇళ్లు చూపించి టీఆర్ఎస్ కు ఓటేస్తే పేదలందరికీ ఇలాగే ఇళ్లు కట్టిస్తామన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.హైద్రాబాద్ ను డల్లాస్ , ఇస్తాంబుల్ లా అభివృద్ధి చేస్తామని 2014లో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.