తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారు. అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టవద్దని ఆయన లేఖలో సూచించారు.

పెండింగ్ అంశాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీ త్వరగా జరపాలని షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలను కోరారు. ప్రాజెక్టుల వివాదాలను ప్రస్తావిస్తూ, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని కేంద్రమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై చర్చించడం కోసం అపెక్స్ కమిటీ భేటీ అవుతూ ఉంటుంది. అయితే కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఆగస్టు 5న జరగాల్సిన భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కేసీఆర్, జగన్‌లకు షెకావత్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే అపెక్స్ కమిటీ భేటీ ఉండనుందని నిపుణులు భావిస్తున్నారు.

జగన్ సర్కార్ నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఇప్పటికే తెలంగాణలోని రాజకీయ పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ ఎప్పుడు జరుగుతుందో.. ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఇరు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.