Hyderabad: ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో కేంద్ర సహకారం 75 శాతం ఉండగా, రాష్ట్ర వాటా కేవలం 25 శాతమే మాత్రమే ఉందని పేర్కొంటూ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ లపై కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై నిజంగా ప్రేమ ఉంటే, ఎస్‌డిఆర్‌ఎఫ్ ఇచ్చే పరిహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Union Minister G Kishan Reddy: రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్)లో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందనీ, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం మాత్రమేనని కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ రైతులు నష్టపోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. "ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇందులో రాష్ట్ర వాటా 25 శాతం మాత్రమే. 2014-15 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఎస్‌డీఆర్‌ఎఫ్ కు రూ.2,196.60 కోట్లు విడుదల చేసింది" అని తెలిపారు. అలాగే, ఎన్డీఆర్ఎఫ్ కింద రూ.873.27 కోట్లు విడుదల చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కు కలిపి మొత్తం రూ.3,069.87 కోట్లను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిందని చెప్పారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొదటి విడత రూ.188.80 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి మరో రూ.188.80 కోట్లు రాష్ట్ర ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు బదిలీ చేయనుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల కురిసి అకాల వర్షాల గురించి ప్రస్తావిస్తూ.. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనీ, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ రైతాంగం నష్టపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. తొలుత ఈ పథకంలో చేరిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఈ పథకం నుంచి వైదొలిగిందని విమర్శించారు. దీంతో అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అనుకోని విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
"దురదృష్టవశాత్తూ వివిధ కారణాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత కానీ, నిర్దిష్ట ప్రణాళిక కానీ లేదు. అలాంటి ఆలోచన లేకుండా కేవలం రాజకీయ కారణాలతోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలిగింది" అని కిషన్ రెడ్డి ఆరోపించారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణలో పంటలు నష్టపోయిన రైతులకు సరైన పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారనీ, అదే సమయంలో 'ఫసల్ బీమా యోజన' అమలు సమయంలో ఎంతో మంది రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పంట నష్టపోయిన లక్షలాది మంది రైతులకు పరిహారం అందుతోందన్నారు. ఇటీవల రాష్ట్రంలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నష్టపరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం దురదృష్టకరమన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూనే మరోవైపు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రైతులకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసిందని పేర్కొన్నారు.
2022 ఏప్రిల్ 1 నాటికి రాష్ట్ర ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలో రూ.608.06 కోట్ల నిధులు ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి గాను విడుదల చేసిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో మొదటి విడత రూ.188.80 కోట్ల కేంద్ర వాటాతో పాటు 2022 జూలై 22న విడుదల చేసిన రాష్ట్ర వాటాతో కలిపి ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో వద్ద సుమారు రూ.860 కోట్ల కార్పస్ ఉందని తెలిపారు. "అంటే పంట నష్టపోయిన రైతులకు అవసరమైన సాయం అందించేందుకు ప్రస్తుతం రాష్ట్ర ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో తగినన్ని నిధులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఎస్డీఆర్ఎఫ్ ఇచ్చిన పరిహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పరిహారం ఇవ్వాలని" డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతుల కష్టాలను అర్థం చేసుకుని వారిని ఆదుకోవడం కంటే కేంద్రంపై నిందలు వేయడం, పబ్లిసిటీ పొందడంపైనే సీఎం దృష్టి సారించారని స్పష్టమవుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు.
