Telangana: గ‌త ఏడేండ్ల  ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పనితీరుపై చర్చకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం సవాల్ విసిరారు. కేసీఆర్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మంటూ కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు.  

Telangana: తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్రశేఖర్ రావు.. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఈ నేప‌థ్యంలోనే గ‌త ఏడేండ్ల ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పనితీరుపై బ‌హిరంగ చర్చకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం సవాల్ విసిరారు. కేసీఆర్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మంటూ కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం నాడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడేండ్ల పాల‌న‌లో మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న కేసీఆర్ ఆరోపణపై మంత్రి కిష‌న్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ కాలంలో ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, ఈ విషయాన్ని చర్చలో నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

అలాగే, ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్‌ అభ్యంతరకర పదజాలంతో దూషిస్తున్నార‌నీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధినేత నిరాశతో ప్రధానిపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వాడుతున్న భాష ముఖ్యమంత్రికి తగదని అన్నారు. బీజేపీని దేశం నుంచి తరిమికొడతామని కేసీఆర్ చెప్పడంపై.. భూమ్మీద ఏ శక్తీ దీన్ని చేయలేదని బీజేపీ కిష‌న్ రెడ్డి అన్నారు. రేపు అధికారం కోల్పోయినా బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతుందని తెలిపారు. 2016లో ఉరీ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ రుజువు కావాలంటూ కేసీఆర్ చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు దేశ భద్రత, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు. "అతను అమరవీరులను అవమానించాడు, మన ధైర్య సైన్యాన్ని నిరుత్సాహపరిచాడు. అత్యున్నత త్యాగం చేసిన వారి కుటుంబాల మనోభావాలను దెబ్బతీశాడు" అని కిష‌న్ రెడ్డి విమ‌ర్శించారు. కేసీఆర్ ఉప‌యోగిస్తున్న భాష‌ను పాకిస్థాన్ కూడా ఉప‌యోగించ‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

పాకిస్థాన్‌తో పాటు అన్ని దేశాలు సర్జికల్ స్ట్రైక్స్‌ను ధృవీకరించాయని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద సంస్థ కూడా తాము దాడికి పాల్పడినట్లు అంగీకరించిందని ఆయన అన్నారు. "మాకు కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. అతనికి రుజువు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయం ప్రజలకు తెలుసు" అని కిష‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాని మోడీ పాలనలో దేశంలో మత విద్వేషాలు పెరుగుతున్నాయ‌ని కేసీఆర్‌ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కొట్టిపారేశారు. గత ఏడేళ్లలో ఐఎస్‌ఐ, టెర్రర్ గ్రూపుల కార్యకలాపాలు అదుపులో ఉన్నాయ‌నీ, మతపరమైన అల్లర్లు తగ్గుముఖం పట్టాయని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమితో కేసీఆర్‌ నిరుత్సాహానికి గురయ్యారనీ, ఈ విషయాన్ని మేధావులు, ప్రజలు అర్థం చేసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. ఉప ఎన్నికల్లో ఓటమిని టీఆర్‌ఎస్ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే బీజేపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.