కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ దళిత కార్యకర్త కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తారు. అనుకోకుండా వారి ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు.
30 ఏళ్లుగా బీజేపీలో ఉంటూ, పార్టీ కోసం పని చేస్తున్న దళిత కార్యకర్త ఇంటికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం వెళ్లారు. ఈ పరిణామానికి ఆ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆనందంలో మునిగిపోయారు. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన అమిత్ షా హైదారాబాద్ లోని మోండా మార్కెట్ ప్రాంతంలోని సభామూర్తినగర్ లో ఉంటున్న 52 ఏళ్ల సత్య నారాయణ ఇంట్లో కొంత సమయం గడిపారు. ఆ కార్యకర్త ప్రత్యేక సామర్థ్యం గల 20 ఏళ్ల కుమారుడు గణేష్, 18 ఏళ్ల మరో కుమారుడు బాలకృష్ణ, భార్య సునందతో కలిసి రెండు గదుల ఇంట్లో ఉంటున్నారు.
ఆభరణాల తయారీ ప్రక్రియలో మిగిలిపోయిన ధూళిని జల్లెడ పట్టడం ద్వారా సత్యనారాయణ నెలకు రూ.10 వేలు సంపాదిస్తారు. అనేక సంవత్సరాలుగా ఆయన బీజేపీ కోసం పని చేస్తున్నారు. అమిత్ షా వారి ఇంట్లో 10 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా వారింట్లో షా బ్లాక్ టీ తాగారు. డ్రై ఫ్రూట్స్ ఓట్స్ బిస్కెట్లు తిన్నారు. కేంద్ర మంత్రి రాక చుట్టు పక్కల ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది.
చిక్కుల్లో కల్వకుంట్ల కవిత.. లిక్కర్ పాలసీ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని బీజేపీ ఆరోపణ
అమిత్ తమ ఇంటికి వస్తున్నారని కొంచెం ముందుగానే తెలిసిందని, తాము ఈ విషయాన్ని నమ్మలేకపోయామని సత్యనారాయణ భార్య సునంద తెలిపారు. భద్రతా బలగాలు ఇంటిని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడే తమకు విషయం తెలిసిందని చెప్పారు. తాము ప్రతిరోజూ ఉపయోగించే కప్పులో టీ అందించానని చెప్పారు. హిందూ సమాజం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీ అని, అందుకే తాను ఆ పార్టీలో కొనసాగుతున్నానని సత్యనారాయణ చెప్పినట్టు ‘డెక్కెన్ క్రానికల్’ పేర్కొంది.
బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే తమ దళిత సామాజికవర్గం అభివృద్ధి చెందుతుందని, అలాగే గౌరవం దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం ఉందని చెప్పారు. దళిత బంధు వల్ల తమకు ఎలాంటి ప్రయోజనమూ లేదని తెలిపారు. కాగా.. అమిత్ షా వెంట కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ షా కూడా ఉన్నారు.
