Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉపఎన్నిక: 'మునుగోడు సమరభేరి'కి కేంద్రమంత్రి అమిత్‌షా..  పార్టీలో చేర‌నున్న రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు ఉపఎన్నిక:  మునుగోడులో బీజేపీ ఆదివారం ‘మునుగోడు సమరభేరి’పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ స‌భ‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  హాజరుకానున్నారు. 

Union Minister Amit Shah attened Munugodu Samarabheri, Rajagopal Reddy will join the party
Author
Hyderabad, First Published Aug 21, 2022, 6:22 AM IST

మునుగోడు ఉపఎన్నిక: మునుగోడు ఉప‌పోరులో కాషాయ జెండా ఎగ‌ర‌వేయాల‌ని బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఈ ఎన్నిక‌లో ఎలాగైనా విజ‌యం సాధించాలని, ప్ర‌త్యార్థి టీఆర్ ఎస్ వ్యూహాలను చిత్తు చేయాల‌ని స్పెష‌ల్ ఫోకస్ పెట్టింది. ఈ నేప‌థ్యంలో మునుగోడులో బీజేపీ ఆదివారం ‘మునుగోడు సమరభేరి’పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ స‌భ‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  హాజరుకానున్నారు. సభలోనే మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భాజపాలోకి ఆహ్వానించనున్నారు. 

ఈ క్ర‌మంలో  తెరాస‌ ప్రభుత్వం అవినీతి, అక్రమాలను ఎండగట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు, అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయాన్ని వివరించాల‌ని అమిత్‌ షా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 

జనసమీకరణపై దృష్టి 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  హాజరుకానున్న ఈ బహిరంగ సభకు భారీ మొత్తంలో జ‌న సమీకరణ చేయాల‌ని బీజేపీ నాయకత్వం ప్ర‌య‌త్నిస్తుంది. అలాగే.. బీజేపీలో  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరుతుండటంతో ఆయన త‌న సొంత నియోజకవర్గంలో ఎలాంటి ప్రాబల్యం ఉందో చాటుకోనున్నారు. అలాగే.. బీజేపీ ఏ విధంగా బలపడిందో.. రాష్ట్ర ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగించేలా  సభను నిర్వహించాలని  బీజేపీ నాయకులు శ్ర‌మిస్తున్నారు.  

కేసీఆర్‌కు గట్టి కౌంటర్!  

దాదాపు  ఏడాది నుంచి కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు స‌రిగా లేవు.. ప‌చ్చిగ‌డ్డి వేస్తే.. భగ్గుమ‌నేలా ఉన్నాయి ప‌రిస్థితులు. సీఎం కేసీఆర్‌ సమయం చిక్కినప్పుడల్లా కేంద్రం, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.  తాజాగా శనివారం మునుగోడులో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎందుకు వాటా ఇవ్వడం లేదో స్పష్టం చేయాలని కేంద్ర మంత్రి అమిత్‌ షాకు సవాల్ విసిరారు. అలాగే.. మునుగోడులో బీజేపీకి ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోయినట్లేన‌ని వ్యాఖ్యానించారు. ఈ విమ‌ర్శ‌లన్నింటికీ అమిత్‌ షా దీటుగా స‌మాధానమిస్తారని  బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. 
 
అమిత్‌ షా షెడ్యూల్‌ ...

కేంద్ర మంత్రి అమిత్  షా ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఆ త‌రువాత హెలికాప్టర్‌లో మునుగోడు సభకు వెళ్లనున్నారు.  ఈ బ‌హిరంగ స‌భ‌లో ఆయన‌ దాదాపు గంటన్నరపాటు ఉండ‌నున్నారు. సభ అనంతరం హైదరాబాద్‌కు వచ్చి.. ప‌లువురు ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీ దాదాపు గంటకుపైగా జ‌ర‌గ‌నున్న‌ది. ఈ భేటీలో బీజేపీ నేత‌ల‌కు త‌దుప‌రి కార్య‌చ‌ర్య‌ణ‌పై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

మునుగోడులో నేడు జరగనున్న కేంద్రమంత్రి అమిత్​షా బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి ద‌గ్గ‌రుండి పరిశీలించారు. ఈ సందర్భంగా కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్నారని ఆయన తెలిపారు. మునుగోడు బైపోల్స్ లో బీజేపీ విజయం సాధిస్తుందని,  హుజూరాబాద్ సీన్    మునుగోడులో రిపీట్ అవుతుందని ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. సీఎం కేసీఆర్ ​ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్నార‌నీ,  గ‌త ఎనిమిదేళ్లలో ఆయ‌న‌ ఇచ్చిన హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios