Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణకు సీఎంగా బీసీ నేత : అమిత్ షా కీలక ప్రకటన

తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా .  తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన ప్రకటించారు. కేసీఆర్ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా అని అమిత్ షా చురకలంటించారు.

union home minister amit shah sensational comments on public meeting in suryapet ksp
Author
First Published Oct 27, 2023, 5:11 PM IST

తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో జరిగిన జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ  అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యమని అమిత్ షా ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను సీఎంను చేయాలని కేసీఆర్ ఆలోచిస్తూ వుంటారని, రాహుల్‌ను ప్రధానిగా చేయాలని సోనియా గాంధీ చూస్తుంటారని ఆయన ఆరోపించారు. 

కేసీఆర్‌కు, సోనియాకు వాళ్ల కుటుంబం మాత్రమే ముఖ్యమని అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు. బీఆర్ఎస్ పేదల వ్యతిరేక, దళితుల వ్యతిరేక పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా అని అమిత్ షా చురకలంటించారు. దళితులకు మూడెకరాలు ఇస్తానన్న హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.50 వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలని అమిత్ షా ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లతో బీసీల సంక్షేమ కార్యక్రమాలు అన్నారు.. ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ రాజ్యాంగబద్ధంగా బీసీ కమీషన్ ఏర్పాటు చేశారని అమిత్ షా తెలిపారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తుందని ఆయన ప్రకటించారు. గిరిజనుల అభివృద్ధికి కూడా బీజేపీ కట్టుబడి వుందన్నారు. సమ్మక్క సారక్క పేరుతో ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోడీ ముందుకు వచ్చారని అమిత్ షా తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రిబ్యూనల్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios