జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రదర్శనపై ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. బీజేపీపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా, బండి సంజయ్‌కి ఆయన అభినందనలు తెలియజేశారు.

కాగా, దుబ్బాక ఉప ఎన్నిక జోష్‌లో బీజేపీ గ్రేటర్‌లో మరింత దూకుడుగా వ్యవహరించింది. టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపింది. అలాగే ఎన్నికల ప్రచారానికి పలువురు బీజేపీ అగ్రనేతలు రావడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చిందనే చెప్పాలి.

గ్రేటర్‌లో బీజేపీ దాదాపు 50 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 46 స్థానాలు అధికంగా గెలుపొందింది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడం టీఆర్‌ఎస్‌పై భారీ ప్రభావాన్ని చూపింది.

గతంలో గ్రేటర్ పోరులో 99 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్ ఈ సారి 56 స్థానాలకే పరిమితమైంది. అంటే దాదాపు 43 స్థానాల వరకు కోల్పోయింది.