హైదరాబాద్:  పాలమూరు-రంగారెడ్డి  ప్రాజెక్టుల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకొంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీశాఖ రెండో దశ అనుమతులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని  నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు.  మరో వైపు ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

పాలమూరు- రంగారెడ్డి   ప్రాజెక్టు పనులను ఇక యుద్ద ప్రాతిపదికన చేపట్లాలని  తెలంగణ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ, అటవీ శాఖ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను మంజూరు చేస్తున్నట్టు  కేంద్ర ప్రభుత్వం నుండి  శుక్రవారం నాడు  తెలంగాణ రాష్ట్రానికి  సమాచారం అందింది. ఈ మేరకు కేంద్ర అటవీ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్  శ్రావణ్ కుమార్  రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం పట్ల  సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు అనుమతిలిచ్చినందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేలా  కృషి చేసిన  సాగు నీటి పారుదల ప్రాజెక్టు అధికారులు,  అటవీశాఖాధికారులను కేసీఆర్ అభినందించారు.