Asianet News TeluguAsianet News Telugu

నేనేం మాట్లాడాను.. ఆయనేం విన్నాడు , ఏం స్పందించాడు : హరీశ్‌రావుకు నిర్మలా సీతారామన్ కౌంటర్

తనపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలంటూ ఆమె చురకలు వేశారు. 

union finance minister nirmala sitharaman counter to harish rao
Author
First Published Sep 3, 2022, 5:28 PM IST

తెలంగాణలో ప్రతి పథకంలో కేంద్రం వాటా వుందన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిధులు పక్కదారి పట్టకుండా డిజిటలైజేషన్ తెచ్చామన్నారు. జిల్లాల పర్యటనలో చాలా విషయాలు తెలుసుకున్నానని ఆర్ధిక మంత్రి వ్యాఖ్యానించారు. 60 శాతం నిధులు కేంద్రం ఇస్తే.. 40 శాతం రాష్ట్రాలు భరించాలని నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రం వాటా ఉన్నప్పుడు పేరు పెట్టడానికి అభ్యంతరం ఏంటని ఆమె ప్రశ్నించారు. 

కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు పేరు ఎందుకు వేయడం లేదని నిర్మలా సీతారామన్ నిలదీశారు. తెలంగాణలో 55 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ప్రాజెక్ట్‌కు హైదరాబాద్ ఎంపీ ఫోటో పెడతారా అని నిర్మలమ్మ ప్రశ్నించారు. రాజీనామా సవాళ్లను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయుష్మాన్ భారత్‌లో 2021 వరకు తెలంగాణ ఎందుకు చేరలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిలదీశారు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలంటూ హరీశ్‌రావుకు నిర్మలా సీతారామన్ చురకలు వేశారు. 

ఫైనాన్స్ కమీషన్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తూనే వున్నామని.. ఈ రాష్ట్రానికి ఎక్కువ, ఆ రాష్ట్రానికి తక్కువ ఇవ్వడం అనేది ఎవరి చేతుల్లోనూ వుండదని ఆమె స్పష్టం చేశారు. సెస్‌ల పేరుతో వసూలు చేసే నిధులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయని.. ఏ కారణంతో సెస్ వసూలు చేశారో, వాటి కోసమే ఆ నిధులు ఖర్చు చేయాలని నిర్మలా సీతారామన్ సూచించారు. 

అంతకుముందు హరీశ్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపు దగ్గర ప్రధాని ఫోటో పెట్టాలని అంటున్నారని.. బియ్యం అంతా వాళ్లే ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని హరీశ్ ఫైరయ్యారు. ఇంత దిగజారేలా మాట్లాడొద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని.. తెలంగాణ నిధులే కేంద్రానికి వెళ్తున్నాయని హరీశ్ రావు చెప్పారు. 

Also Read:దేశంలో మా డబ్బులూ వున్నాయి.. కేసీఆర్ ఫోటో పెడతారా : నిర్మలమ్మపై హరీశ్ ఫైర్, క్షమాపణలకు డిమాండ్

కేంద్రంలో ముందుగా మా కేసీఆర్ ఫోటో పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. నోరు విప్పితే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని.. అబద్ధాలు చెప్పి నిజాలు దాచే ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్ రావు చురకలు వేశారు. పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఏటా రూ.3,610 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రానికి రూ.1.7 లక్షల కోట్లు అదనంగా ఇచ్చామని.. మీరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని , మేం వాస్తవాలు మాట్లాడుతున్నామని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారలేదని అమిత్ షా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

ఆయుష్మాన్ భారత్ విషయంలో తెలంగాణపై అవాస్తవాలు చెబుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. మేం ఇప్పటికే చేరి వుంటే మీరు రాజీనామా చేస్తారా అని హరీశ్ రావు సవాల్ విసిరారు. 2021లోనే ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ ప్రభుత్వం చేరిందని మంత్రి గుర్తుచేశారు. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్రం కూడా ప్రకటించిందని.. అబద్ధాల మంత్రుల లిస్టులో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోయారని హరీశ్ రావు చురకలంటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios