Asianet News TeluguAsianet News Telugu

కలెక్టర్‌ను నిలదీసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. మోడీ ఫొటో ఏదంటూ ఫైర్

కామారెడ్డిలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి బాన్సువాడలో నిరసన సెగ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆమె బీర్కూర్‌లోని ఓ రేషన్ షాపులోకి వెళ్లి లబ్దిదారులతో మాట్లాడారు. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత? అని కలెక్టర్‌ను అడిగారు. అలాగే, మోడీ ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

union finance minister nirmala sitaraman questions kamareddy collector over not putting modi photo in ration shop0
Author
First Published Sep 2, 2022, 2:33 PM IST

బీర్కూర్: మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కామారెడ్డిలో పర్యటించారు. బాన్సువాడలో ఆమెకు నిరసన సెగ తగిలింది. బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తాకు చేరగానే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసు సిబ్బంది వెంటనే అప్రమత్తం అయింది. నిరసనకారులను ఎక్కడికక్కడే పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి బీర్కూర్‌లోని ఓ రేషన్ షాపును సందర్శించారు.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ పట్టణంలోని ఓ సొసైటీ కార్యాలయంలోని రేషన్ షాపును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రేషన్ లబ్దిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం, గోధుమల గురించి మాట్లాడారు. లబ్దిదారులకు అవగాహన కల్పించారు. ఈ తరుణంలో రేషన్ డీలర్ ఓ లబ్దిదారుడిని బెదిరించినట్టుగా మాట్లాడారు. ఈ విషయాన్ని చూసిన ఆమె ఆ డీలర్ పై సీరియస్ అయ్యారు. సదరు డీలర్ పై యాక్షన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ప్రధానమంత్రి అన్న కళ్యాణ్ యోజనాలో భాగంగా కరోనా కాలం నుంచి కేంద్రం ఉచితంగా అదనంగా అందిస్తున్న బియ్యం గురించి మాట్లాడారు. అదే విధంగా పేదలకు రూపాయికి కిలో బియ్యం చొప్పున ఇస్తున్న ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత అని ఆమె కలెక్టర్‌ను అడిగారు. దీనిపై ఆయన అంచనాగా ఓ ఫిగర్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె తప్పుబట్టారు. తనకు కచ్చితమైన వివరాలు అందించాలని నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వాటా డబ్బులు భరిస్తున్నాయనేది స్పష్టంగా తనకు చెప్పాలని అడిగారు. ఆయన కలెక్టర్ అని, ఆయనకు తెలుసు అని వివరించారు. మరో అరగంట తర్వాతైనా వివరించాలని అన్నారు.

బయట మార్కెట్‌లో సుమారు 35 రూపాయలకు కిలో వచ్చే బియ్యాన్ని ఈ పథకం ద్వారా రూపాయికే కిలో బియ్యం బీదలకు అందుతున్నాయని ఆమె వివరించారు. తనకు తెలిసిన వరకు ఇదులో రూ. 28 వరకు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.

అలాగే, పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా బియ్యం ఇస్తున్నప్పటికీ రేషన్ షాపులో ఒక్క మోడీ ఫొటో కూడా లేకపోవడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్‌ను ప్రశ్నించారు. కచ్చితంగా రేషన్ షాపులో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టించాలని డిమాండ్ చేశారు. ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన ఫొటో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios