ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే కేంద్ర కేబినెట్‌‌ను పునర్వ్యవస్థీకరణ చేపట్టున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో తెలంగాణ నుంచి మరొకరికి చోటు లభించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది.

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే కేంద్ర కేబినెట్‌‌ను పునర్వ్యవస్థీకరణ చేపట్టున్నారనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత మోదీ ఈ ప్రక్రియను చేపట్టనున్నారని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ సెషన్- 2023కి ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కేబినెట్‌లోని కొందరు సభ్యులను బయటకు పంపే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో సీనియర్ నేతలు ఉండే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం దృష్ట్యా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన ఒకరికి చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బీజేపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి మరొకరికి చోటు కల్పించాలనే భావనలో ప్రధాని మోదీ ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇక, 2023లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మంత్రివర్గ ప్రక్షాళన జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల నేతలు, పార్టీ ముఖ్య నేతలతో పార్టీ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో ఎంతమంది మహిళలు, రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన వారికి అవకాశం కల్పించాలనే దానిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి మరొకరికి కేబినెట్‌లో బెర్త్ దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొంతకాలంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణపై ప్రత్యేక దృష్ట సారించిన బీజేపీ అధినాయకత్వం.. గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు మార్గనిర్దేశనం చేస్తోంది. ఇతర పార్టీల నుంచి పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తుంది. 

అదే సమయంలో తాము తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్ నేత కె లక్ష్మణ్ గతేడాది యూపీ నుంచి రాజ్యసభకు పంపింది. తాజాగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన పక్షంలో తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం కల్పించాలని కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి లోకసభకు, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, రాజ్యసభ సభ్యునిగా ఉన్న లక్ష్మణ్ మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. అరవింద్, బాబూరావు‌లలో ఒక్కరికి కేబినెట్ బెర్త్ జరగవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.